ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన ముగిసింది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో జగన్ సమావేశం కావడంతో వైసీపీ వర్గాలు కూడా ఘనంగా ప్రచారం చేసుకుంటున్నాయి.
రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై జగన్ అమిత్ షాతో చర్చించారని చెబుతున్నారు.
గురువారం దిల్లీ వెళ్లిన జగన్ ఈసారి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు.
అమిత్ షాతో విభజన సమస్యలు, రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆస్తుల పంపకం సహా అనేక విభజన సమస్యలన్నీ పెండింగులో ఉండడంపై జగన్ చర్చించినట్లు సమాచారం.
అయితే, అమిత్ షా మాత్రం ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికల అంశం జగన్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది.
ప్రధానితో జరిగిన సమావేశంలోనే ఇది చర్చకు రాగా దీనిపై అమిత్ షా మరింత డీటెయిల్డ్‌గా మాట్లాడతారని ప్రధాని చెప్పినట్లు సమాచారం. ఆ క్రమంలోనే శుక్రవారం ఉదయం అమిత్ షా, జగన్‌ల భేటీలో రాష్ట్రపతి ఎన్నికల అంశంపై చర్చ జరిగింది.
రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిని వైసీపీ బలపరచాలని అమిత్ షా సూచించారని.. అందుకు జగన్ తలూపారని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్ధతు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈసారి ఆ పార్టీ సంఖ్యాబలం మరింత ఎక్కువగా ఉంది. పైగా ఎన్డీయే కూటమికి పూర్తి సంఖ్యాబలం లేదు. దీంతో వైఎస్సార్సీపీ, బీజేడీ వంటి తటస్థ రాజకీయ పార్టీల మద్ధతు అవసరమవుతోంది.
ఇప్పటికే బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో బీజేపీ అగ్రనాయకత్వం చర్చలు జరిపింది.
తాజాగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా ఇదే తరహాలో మంతనాలు చేసింది.
అభ్యర్థి ఎవరో చెబితే మద్దతు విషయం మాట్లాడొచ్చని జగన్ అన్నప్పటికీ అభ్యర్థితో సంబంధం లేకుండా మద్దతు ఇవ్వాలని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది.
దాంతో జగన్ పెద్దగా ప్రతిఘటించకుండా ఆ ప్రతిపాదనకు ఒప్పుకొని తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చినట్లు దిల్లీ వర్గాల సమాచారం.