అగ్రరాజ్యంలో కొత్త అధ్యక్షుడికి ఏడాది తిరిగే సరికే ప్రజల నుంచి భారీ సెగ తగులుతోంది. బైడెన్ మాకొద్దు బాబోయ్! అనేవారు పెరిగిపోయారు.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచింది. ఈ నేపథ్యంలో ఒక సర్వే జరిగింది. దీనిలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అధ్యక్ష పదవిని సరిగా నిర్వహించడం లేదని మెజారిటీ ప్రజలు బైడెన్‌ను విమర్శించారు. కరోనా మహమ్మారి, ధరల పెరుగుదల కారణంగా బైడెన్ గ్రాఫ్ తగ్గిపోయిన ట్లు తెలుస్తోంది. ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్-ఎన్ఓఆర్సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ కలిసి ఈ సర్వే చేపట్టాయి.
అధ్యక్ష బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తున్నారని జో బైడెన్‌కు 43 శాతం మంది ప్రజలు మాత్రమే ఓటేశారు. జులైలో నిర్వహించిన ఇదే సర్వేలో 59 శాతం బైడెన్ అధ్యక్ష బాధ్యతలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో ఇది 50 శాతంగా ఉంది. కరోనా నియంత్రణలోనూ బైడెన్ పనితీరుపై అనేక మంది నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. 45 శాతం మంది మాత్రమే కరోనాపై బైడెన్ పనితీరు సంతృప్తికరంగా స్పందించారు. 2021 జులైలో 66 శాతం, డిసెంబర్లో 57 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
2024 ఎన్నికల్లో బైడెన్ తిరిగి పోటీ చేయాలని 28 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. 2024లో పోటీ చేసేందుకు మానసికంగా సిద్ధంగానే ఉంటారని వీరు విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, 50 శాతం మంది మాత్రం.. బైడెన్ మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండలేరని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ విషయంలో 37 శాతం మంది మాత్రమే బైడెన్‌ను మెచ్చుకున్నారు. కరోనా వైరస్, ఆర్థిక వ్యవస్థ పనితీరు, పన్ను విధానాలు, అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగడం వంటి అంశాల వల్ల ఆయన గ్రాఫ్ పడిపోయినట్లు తెలుస్తోంది.
డెన్ అధ్యక్షుడు అయ్యాక దేశం ఐకమత్యం సాధించిందని 16 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేయగా.. అమెరికా మరింత విభజనకు గురైందని 43 శాతం మంది పేర్కొన్నారు. శ్వేతసౌధాన్ని సమర్థంగా నిర్వహించే సత్తా బైడెన్‌కు ఉన్నట్లు 28 శాతం మంది పేర్కొన్నారు. 38 శాతం మంది మాత్రం బైడెన్‌పై అసలు నమ్మకం లేదని చెప్పారు. 33 శాతం మంది బైడెన్‌ను కొంతవరకు నమ్ముతున్నట్లు తెలిపారు. అయితే, ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ మెరుగైన స్థితిలోనే ఉన్నారని సర్వే పేర్కొంది.
2018 ఫిబ్రవరిలో ట్రంప్ పనితీరును 35 శాతం మంది మెచ్చుకోగా.. తాజాగా బైడెన్‌ను 33 శాతం మంది ఆమోదించారని సర్వే తెలిపింది. అయితే, ఈ సర్వేను బైడెన్ ఆమోదించలేదు. అధ్యక్షుడి మానసిక ఆరోగ్యంపై అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్న వ్యాఖ్యలను కూడా బైడెన్ తీవ్రంగా ఖండించారు. ‘ఈ సర్వేలను నేను నమ్మను’ అంటూ వ్యాఖ్యానించారు.