ఏదేశ మేగినా ఎందుకాలిడినా.. తెలుగు తేజాలు మెరుస్తున్నాయి.
తెలుగు వెలుగులు ప్రసరిస్తున్నాయి.
తాజాగా విజయవాడకు చెందిన విద్యార్థి ‘సూర్యకాంత్ ప్రసాద్ గొట్టిపాటి’ కూడా అమెరికాలో అరుదైన పదవిని దక్కించుకుని భారత కీర్తిని, ఇటు తెలుగువారి గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశారు.
అమెరికాలో సుప్రశిద్ధ విశ్వవిద్యాలయం అమెరికా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో విద్యార్థి సంఘానికి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఈవిశ్వవిద్యాలయంలో సుమారు 50 వేల నుంచి 60 వేల మంది అమెరికా సహా.. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు.
1956లో ప్రారంభమైన అమెరికా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థ.
తాజాగా జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ‘సూర్యకాంత్ ప్రసాద్ గొట్టిపాటి’ ఘన విజయం దక్కించుకున్నారు.
దీంతో ఆయన 50 – 60 వేల మంది విద్యార్థులను ముందుండి నడిపించే బాధ్యతను సొంతం చేసుకున్నారు.
ఈ పదవ కాలం ఏడాదిపాటు ఉంటుంది.
ఈ ఏడాది మే 6వ తేదీ నుంచి వచ్చేఏడాది 5వ తేదీ వరకు ‘సూర్యకాంత్ ప్రసాద్ గొట్టిపాటి’ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
కేవలం విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగానే కాకుండా.. యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలోనూ సభ్యుడిగా కొనసాగనున్నారు.
విద్యార్థుల సమస్యలు, యూనివర్సిటీ అభివృద్ధి తదితర కీలక అంశాలపై ఆయన బలమైన గళం వినిపించేందుకు అవకాశం ఏర్పడింది.
ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ తుది సంవత్సరం చదువుతున్నారు.
విజయవాడకు చెందిన పద్మజ, రామకృష్ణ ప్రసాద్‌ల ముద్దుల బిడ్డ అయిన ‘సూర్యకాంత్ ప్రసాద్ గొట్టిపాటి’ మూడేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు.
తమ కుమారుడు అమెరికా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల ఆయన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.