తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలి సిందే. అయితే.. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్.. అంబేద్కర్ మునిమనవడు(కూతురు-కూతురు బిడ్డ) ప్రకాశ్‌ను పిలిచారు. ఈయన ద్వారా.. జాతీయస్థాయిలో నిలవాలన్న కేసీఆర్ ఫలింప జేసుకున్నా రనే టాక్ మేధావి వర్గాల నుంచి వినిపిస్తుండడం గమనార్హం.
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌నే ఉండాలనే. అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని ఆయన ముని మనవడు ప్రకాశ్ తెలిపారు. సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ భావజాలం ఎంతో అవసరమని.. తన ఆదర్శాలను పాటించడమే మనం అందరం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. 1923లోనే రూపాయి సమస్యపై అంబేద్కర్ రాశారని పేర్కొన్నారు. నవ భారతంలో కొన్ని అతి చిన్న కులాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు.
ఆర్థిక దుర్భలత్వంపై పోరాడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రకాశ్ అంబేద్కర్ కొనియాడారు. అలాగే రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కూడా కేసీఆర్ ముందుకు తీసుకెళుతున్నారని ఆకాశానికి ఎత్తేశారు. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు ముందుగా అంబేద్కర్ మద్దతిచ్చారని గుర్తు చేశారు.
దేశానికి రక్షణ సమస్య వస్తే.. మరో రాజధాని అవసరమని అందుకు హైదరాబాద్‌నే సరైందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని అన్నారు. ఎందుకంటే పాక్, చైనా నుంచి భాగ్యనగరం ఎంతో దూరంలో ఉందని భావించి.. ఆనాడే ఎంతో దూరదృష్టితో ఆలోచించారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో జాతీయ నాయకులు కరువయ్యారని అన్నారు. వాజ్‌పేయి వంటి జాతీయ నాయకులు కనిపించట్లేదని ఆవేదన చెందారు.
కొసమెరుపు: మొత్తానికి కేసీఆర్ లక్ష్యం నెరవేరింది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు.. ఆయన ఫ్యామిలీతోనూ మోదీని పరోక్షంగా దుయ్యబట్టేలా చేయించారని అంటున్నారు మేధావులు.