వైసీపీ నాయకుల మధ్య సఖ్యత లేదని మరోసారి రుజువు చేసే ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. ఈ నియోజకవర్గం నుంచి సుదీర్ఘ విరామ తర్వాత వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు విజయం సాధించారు. నరసారా వు పేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఇటీవల కొన్నాళ్లుగా టీడీపీ నాయకు లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఈ అక్రమాలకు సాక్ష్యాలు కూడా ఉన్నాయ ని చెబుతున్నారు. దీంతో ఇది వివాదంగా మారి.. రాష్ట్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై వైసీపీ నాయకులు కూడా గుర్రుగానే ఉన్నారు. అయితే.. ఈ ఆరోపణలపై అంబటి.. ఎక్కడా స్పందించక పోవడం గమనార్హం.
అంబటి పై ఆరోపణలతో కొత్త మలుపు
పేదలకు ఇళ్ల పంపిణీ విషయంపై ఫైనల్ చేసేందుకు కొన్నాళ్ల కిందట నరసరావు పేట ఎంపీ లావు కృష్ణదేవ రాయులు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సమయంలో చాలా మంది టీడీపీ నేతలు అనూహ్యంగా ఆయనను కలిసి యువ ఎంపీ తండ్రి లావు రత్తయ్యతో ఉన్న పూర్వ పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనతో మాట్లాడారు. ఈ సమయంలోనే.. అంబటి అక్రమాలు చేస్తున్నారని.. మైనింగ్ ను దోచుకుంటున్నారని ఫిర్యాదులు చేశారు.
అంతేకాదు.. స్థానిక మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగులను కూడా ఆయనకు చూపించారు. దీంతో నేరుగా లావు.. అంబటికి ఫోన్ చేసి.. వివరణ కోరినట్టు తెలుస్తోంది. అయితే.. ఈ విషయాలు నీకు తెలియవు.. అని అంబటి ఫోన్ కట్ చేయడంతో హర్ట్ అయిన.. లావు.. ఈ విషయాన్ని ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
అంబటిపై సజ్జలకు ఫిర్యాదు
ఇదే విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్.. సజ్జల రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా రాజకీయ పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డికి నేరుగా ఎంపీ ఫిర్యాదు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అంబటి.. ఎంపీకి మండల స్థాయిలో ఏం పని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిదులు సాధించేందుకు ప్రయత్నించాలి.. అంటూ.. ఎంపీకి తెలిసేలా వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఎంపీ ఇంకోసారి వస్తే.. తనకు చెప్పకుండా రావొద్దంటూ.. ఎంపీ కార్యాలయానికి లేఖరాశారు. ప్రస్తుతం ఈ వివాదం సజ్జల, వైవీల పంచాయతీకి చేరింది. ఏం చేస్తారో చూడాలి.
ఇదిలావుంటే, అంబటిపై స్థానికంగా కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన పెద్దగా ఉండడం లేదని.. గుంటూరుకే పరిమితమవుతున్నారని.. కేవలం రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు.