పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజైందంటే చాలు.. రాజకీయంగా అది చర్చనీయాంశం అవ్వాల్సిందే అన్నట్లు తయారైంది ఏపీలో పరిస్థితి. రీఎంట్రీలో ఆయన చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాల విషయానికి వస్తే.. వాటికి టికెట్ రేట్ల తగ్గింపు, స్పెషల్ షోలు పడకపోవడం మీద పెద్ద చర్చ నడిచింది. పవన్ కొత్త చిత్రం ‘బ్రో’కు ఈ గొడవ ఏమీ లేకపోయింది. విడుదల ముంగిట ఏ వివాదం లేకుండా అంతా సాఫీగానే గడిచిపోయింది. కానీ రిలీజ్ తర్వాత కొత్త గొడవ మొదలైంది.
ఈ సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును పోలిన శ్యాంబాబు పాత్ర మీద పెద్ద చర్చ నడిచింది. దీని మీద ఒకటి రెండుసార్లు ప్రెస్ మీట్లలో మాట్లాడారు అంబటి. నిన్న రెండో ప్రెస్ మీట్లో అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా ఇండస్ట్రీ జనాలకు వార్నింగులివ్వడం.. పవన్ మీద తాము కూడా సినిమాలు తీస్తామని ప్రకటించడం.. ‘బ్రో’ సినిమా డిజాస్టర్ అంటూ వసూళ్ల వివరాలు చదవడం ద్వారా అంబటి పెద్ద షాకిచ్చారు.
నిన్న చేసిన పనికే.. మంత్రిగా మీ బాధ్యతలేంటి మీరు చేస్తున్న పనేంటి అంటూ జనసైనికులతో పాటు చాలామంది ఆయన్ని ప్రశ్నించారు. ఈ రోజు అంబటి గురించి జరుగుతున్న ప్రచారమైతే ఇంకా షాకింగ్‌గా అనిపిస్తోంది. ‘బ్రో’ సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి, పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన పారితోషకం విషయంలో ఆయన సందేహాలు వ్యక్తం చేస్తూ.. తోటి వైసీపీ నాయకులతో కలిసి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేయబోతున్నారట. ఈ మేరకు ఆయన ఒక టీంతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
అక్కడికి వెళ్లి పార్టీ అగ్ర నేత, ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి.. ఆయన సలహాలు తీసుకున్న అనంతరం పవన్‌తో పాటు ‘బ్రో’ నిర్మాతల మీద ఈడీకి ఫిర్యాదు చేయనున్నారట. ముందు ఇది జోకేమో అనుకున్నారు కానీ.. ఈమేరకు సీరియస్‌గానే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి పోలవరం నిధుల గురించి ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్లారా.. కేంద్రంతో పోరాడారా.. ఒక సినిమా ఆర్థిక విషయాల మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటి అంటూ నెటిజన్లు అంబటిని ఏకిపడేస్తున్నారు.