భారత క్రికెటర్, మన తెలుగు వాడు అంబటి రాయుడు క్రికెట్లో హిట్టయినట్టుగా.. రాజకీయాల్లో హిట్ అవుతాడని అందరూ ఆశించారు. అనుకున్నారు కూడా. అయితే.. అదేంటో ఆయన ఇలా రాజకీయాల్లోకి వచ్చి.. అలా బయటకు వెళ్లిపోయారు. పట్టుమని మూడు శుక్రవారాలు కూడా రాజకీయాల్లో ఆయన పాత్రలేక పోవడం గమనార్హం. బహుశ ఇంత త్వరగా.. రాజకీయాలు ఒంటబట్టేశాయా? అనేది ప్రశ్న.
ఇంతకీ విషయం ఏంటంటే.. గత డిసెంబరు 12వ తేదీన వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు. నేరుగా సీఎం జగన్ చేతుల మీదుగానే పార్టీ కండువా మార్చుకున్నాడు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన రాయుడు వైసీపీలో చేరడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఆయనకు టికెట్ కూడా ఇస్తున్నారని.. ఎంపీ సీటు నుంచి అంబటి పోటీ ఉంటుందని అనుకున్నారు.
కానీ, అనూహ్యంగా వైసీపీలో చేరి నెల రోజులు కూడా కాకుండానే అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్టు పేర్కొన్నాడు. “వైసీపీ నుంచి బయటకు వస్తున్నా. కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నా. తర్వాత ఏం చేస్తాననేది త్వరలోనే చెబుతా“ అని రాయుడు తాజాగా ట్వీట్ చేశారు. దీంతో వైసీపీలోనే కాకుండా.. రాజకీయంగా కూడా రాయుడు చేసిన పని చర్చనీయాంశం అయింది. దీనిపై వైసీపీ నాయకులు ఏమంటారో చూడాలి.
ఏమై ఉంటుంది?
అంబటి రాయుడు.. ఇలా వైసీపీలో చేరి అలా బయటకు రావడం వెనుక ఏమై ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం వైసీపీలో నెలకొన్న పరిస్థితులు.. లేదా టికెట్ దక్కని వారు చేస్తున్న విమర్శలతో ఒకింత గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజకీయం అంటే ఇలానే ఉంటుందా? అని రాయుడు ఆలోచనలో పడి ఉంటారు. అందుకే ఇలా.. కొన్నాళ్లు ఆగి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలోనే భాగంగానే ప్రస్తుతానికి ఆయన ఇలా చేసి ఉంటారని అంటున్నారు.