వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి ఇంఛార్జ్ గా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని నియమించాలని నిర్ణయించారు. మొన్నటి ఎన్నికల తర్వాత వైసీపీ ఖాళీ అవుతోంది. చోటా మోటా నాయకులే కాకుండా ముఖ్య నాయకులు, సర్పంచులు, మంత్రులుగా పని చేసిన వారు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.
ఇలాంటి తరుణంలో జగన్ 2025 జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఖాళీ అయిన స్థానాలకు కొత్త ఇంచార్జ్ లను నియమించడమే కాకుండా.. బలాబలాలను బట్టి పలు నియోజకవర్గాల్లో నేతలను మారుస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపుతున్నారట. ఈ మేరకు తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు కూడా రానున్నాయని తెలుస్తోంది.
అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అంబటికి పెద్ద షాక్ అనే చెప్పాలి. దశాబ్దన్నర కాలం నుంచి సత్తెనపల్లి నియోజవకర్గంలో అంబటి చక్రం తిప్పుతున్నారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అంబటి.. 2019లో అదే స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికల్లో కూటమి థాటిని తట్టుకోలేక ఆయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు.
అయితే తాజాగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అంబటికి జగన్ సూచించారట. ఇప్పటికే ఆయన సోదరుడు పొన్నూరు ఇంచార్జుగా ఉన్నారు. ఫ్యామిలీలో ఒకరికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్న జగన్.. సత్తెనపల్లి ఇంఛార్జ్ గా ఆళ్ల రామకృష్ణారెడ్డిని దాదాపు ఫైనల్ చేశారు. ఇక నుంచి తెర వెనుక రాజకీయాలకు పరిమితం కావాలని అంబటికి సైతం జగన్ చెప్పేశారట. ఇటువంటి పరిస్థితి వస్తుందనే గత కొంత కాలం నుంచి అంబటి పార్టీకి, పార్టీ అధ్యక్షడికి ఎంతో విధేయత చూపిస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా కూటమి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. కానీ అంబటి జిమ్ముక్కులు జగన్ ముందు ఏ మాత్రం పని చేయలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.