ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 మీడియా చానెళ్లు, పత్రికలపై సీఎం జగన్ కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సదరు మీడియా సంస్థలు పనిగట్టుకొని ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతున్నాయనేది జగన్ వాదన. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ, జగన్ అసమర్థ పాలనను ఎండగడుతున్నందుకే తమను టార్గెట్ చేస్తున్నారని ఆ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ ను స్ఫూర్తిగా తీసుకున్న మంత్రి అంబటి రాంబాబు కూడా ఓ వర్గం మీడియా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘సమావేశానికి ఆ విలేకరులు ఎవరూ రాలేదు కదా?.. వస్తే తిట్టి పంపుదామని’ అని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మిగతా విలేకరుల వద్ద చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. వైసీపీ కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం ఉందంటూ కొందరు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సమాచారం అందగా వారు వెళ్లారు. కానీ, చాంబర్లోనే ఉన్న అంబటి సమావేశానికి రాలేదు. మంత్రికి బదులుగా వైసీపీ నియోజకవర్గ నేతలే సమావేశాన్ని ముగించేశారు. ఆ సమావేశం ముగిశాక విలేకరులను పిలిచిన అంబటి ఓ వర్గం మీడియాపై షాకింగ్ కామెంట్లు చేశారు.
తన పనితీరు ఎలా ఉందో చెప్పాలని విలేకరులను ప్రశ్నించిన మంత్రికి విలేకరులు కూడా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టులో కొండపోరంబోకు భూముల పరిహారాన్ని అధికారులు బినామీ పేర్లతో పక్కదారి పట్టిస్తున్నారంటూ ఓ ప్రముఖ దినపత్రికలో కథనం వచ్చిందని ప్రస్తావించిన మంత్రి ఈ ఘటనపై విచారణ చేయిస్తామన్నారు.
కాగా, నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగానూ మీడియా ప్రతినిధులపై మంత్రి రుసరుసలాడారు. సంగం బ్యారేజి పనులను పరిశీలిస్తున్న సందర్భంగా అంబటికి ఓ విలేకరి అడిగిన ప్రశ్న చిరాకు తెప్పించినట్లుంది. అన్నమయ్య ప్రాజెక్టు పూర్తి చేయకుండా సంగం బ్యేరేజు పనులు పూర్తి చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఆ మీడియా ప్రతినిధిపై మంత్రిగారు చిందులు తొక్కారు. ‘నువ్వు ప్రశ్నలు వేస్తున్నావా? ఉపన్యాసమిస్తున్నావా?’ అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి జారుకున్నారు. ఏది ఏమైనా, మీడియాపై మంత్రి వైఖరి వివాదాస్సదంగా మారిందని టాక్ వస్తోంది.