విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను తీసుకురావడంలో సక్సెస్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకైతే జగన్, ఆయన మంత్రులు సాగిలపడ్డారనే చెప్పాలి. విశాఖపట్నం విమానాశ్రయంలో అంబానీ దిగిన దగ్గర నుంచి సదస్సు వేదికపైకి వచ్చేవరకు అంబానీకి దక్కిన స్వాగతం ఇంకే పారిశ్రామికవేత్తకూ దక్కలేదు. ఆఖరుకు సొంతరాష్ట్రానికి చెందిన జీఎంఆర్‌కు కూడా అలాంటి ప్రాధాన్యం దక్కలేదు.
అంబానీ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగితే ఏపీ మంత్రులు, ఎంపీలు అక్కడ ఆయన కోసం వెయిట్ చేసి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. సదస్సు వేదికపైకి ఆయన రాగానే సీఎం జగన్ ఎదురెళ్లి అంబానీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అంబానీకి రెండు చేతులతో చుట్టేశారు. ఎందుకోగానీ తనకు అలవాటైన పాదాభివందనం మాత్రం జగన్ చేయలేదు.
అయితే… 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయిన్న ఏపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ఈ సదస్సు వేదికగా అంబానీ ఏపీలో చేస్తామన్న ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇవ్వబోయే ఉద్యోగాలు ఎన్ని? అనే విషయం వచ్చేసరికి మాత్రం పెదవి విరుపే మిగిలింది. అంతా గాలి లెక్కలు.. అయిపోయిన పెళ్లికి బాజాలే అన్నట్లుగా ఉన్నాయి అంబానీ పెట్టుబడులు.
ఇన్వెస్టర్ల సదస్సుకు తొలిరోజే హాజరైన అంబానీ ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన తన ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 10 గిగా వాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్ పెడతామన్నారు. ఇది ముఖ్యమైన ప్రకటనే. అయితే, ఆయన చెప్పిన మిగతా పెట్టుబడులు మాత్రం ఆల్రెడీ అమ్ముడైపోయిన సరకులే. కేజీ బేసిన్లో ఎప్పడో 1.5 లక్షల కోట్లతో గ్యాస్ వెలికితీత ప్రాజెక్ట్.. అలాగే జియో 4జీ నెట్‌వర్క్‌లో భాగంగా ఇన్వెస్ట్ చేసిన 40 వేల కోట్లు… ఇంతకుముందే అనుకున్న 5జీ నెట్వర్క్ ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా లేటెస్ట్ లెక్కల్లో కలిపేశారు అంబానీ.
ఇకపోతే అంబానీ మనిషి పరిమళ్ నత్వానీని ఇప్పటికే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి రుణం తీర్చుకున్నారు. నిజానికి జగన్ ఈ ఇన్వెస్టర్ల సదస్సులో అంబానీపై చాలా ఆశలు పెట్టుకున్నారని.. కానీ, ఆయన మాత్రం సోలార్ ప్లాంట్ మినహా ఇతరత్రా ఏమీ ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా జగన్‌ను ఉసూరుమనిపించారని అంటున్నారు.