సీఎం జగన్ పదవి చేపట్టిన వెంటనే నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ జగన్ కొత్త పల్లవి అందుకోవడంతో తమ కలల రాజధానికి వేల ఎకరాలు ఇచ్చిన రైతుల కడుపు మండింది. ఆ కడుపుమంటతోనే కదం తొక్కిన రైతన్నలు…పోరు బాట పట్టారు. పలుగు పార పట్టిన చేతులతోనే ఉద్యమ బ్యానర్లు, జెండాలు పట్టారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులు ఉద్యమ స్ఫూర్తికి జగన్ సైతం తలవంచక తప్పలేదు.
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. అయితే, హైకోర్టు తీర్పుతోపాటు అమరావతి రైతుల ఉద్యమం వల్లే జగన్ దిగి వచ్చారు. ఈ క్రమంలోనే అమరావతి రైతులు చేపట్టిన ఆ మహోద్యమం నేటితో 1000 రోజులు పూర్తి చేసుకుంది. కానీ, హైకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ జగన్ మరోసారి మూడు రాజధానులంటూ పాత పాటే పాడుతున్నారు. దీంతో, అమరావతి టు అరసవెల్లి పేరుతో మహాపాదయాత్ర 2.0కు ఈ ఉదయం అమరావతి రైతులు అంకురార్పణ చేశారు.
ఈ రోజు తెల్లవారుజామున వెంకటపాలెంలోని టీటీడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు ఆలయం బయట ఉన్న వేంకటేశ్వరస్వామి వారి రథాన్ని నడిపి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జగన్, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే చివరకు రైతులు పాదయాత్రను మొదలుబెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అమరావతి పరిరక్షణ సమితి, రైతు జేఏసీ నేతలు పాల్గొన్నారు.
మహాపాదయాత్ర 2.0…మొత్తంగా 1000 కిలోమీటర్ల మేర సాగనుంది. సెప్టెంబరు 12న అమరావతిలో మొదలైన ఈ యాత్ర నవంబరు 11న శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయాకి చేరుకోవడంతో ముగుస్తుంది. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల రైతులు, మహిళలు, రైతు కూలీలు విడతల వారీగా ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు.
60 రోజుల పాటు 12 పార్లమెంటు, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. తొలి రోజు వెంకటపాలెం, కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరి వరకు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్ర చేస్తున్న వారు ఈ రాత్రికి మంగళగిరిలోనే బస చేయనున్నారు. మరోవైపు అమరావతి రైతుల పాదయాత్రకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. పాదయాత్రలో టీడీపీ, బీజేపీ, జనసేన, సీపీఐ పార్టీలకు చెందిన కొందరు నేతలు పాల్గొనబోతున్నారు.
వైసీపీ ప్రభుత్వ దగా, కుట్రల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించేందుకు రాజధాని రైతులు ఉద్యమ బావుటా ఎగరేసి నేటికి వెయ్యి రోజులు. ఈ సందర్భంగా ‘బిల్డ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ఈరోజు 'అమరావతి నుంచి అరసవల్లి'కి మహా పాదయాత్ర ప్రారంభమైంది. (1/2) pic.twitter.com/3uBRKIzdZJ
— Telugu Desam Party (@JaiTDP) September 12, 2022