అమరావతి…ఈ పేరు వినగానే ప్రతి ఆంధ్రుడి గుండె చప్పుడు వేగం పెరుగుతుంది. అందుకే, చరిత్రాత్మక రాజధానిగా గుర్తింపు పొందిన అమరావతి పేరును నవ్యాంధ్ర రాజధానికి పెట్టారు నాటి సీఎం చంద్రబాబు. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి ఏపీ లోటు బడ్జెట్ తో అప్పుల్లో కూరుకుపోయి ఉంది. అయినా సరే…ఆంధ్రా ప్రజల కోసం, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు సంకల్పించారు.
అమరావతి నిర్మాణం కోసం రైతులు వేలాది ఎకరాల పంట పొలాలను త్యాగం చేశారు. ఇక, అమరావతి కోసం ఎన్నారైలు భూములు విరాళాలుగా ఇవ్వడంతోపాటు…భారీగా నగదు రూపంలో విరాళాలు ఇచ్చారు. కట్ చేస్తే…సీఎం జగన్ అయిన తర్వాత అమరావతిని అటకెక్కించారు. దీంతో, అమరావతి రైతులు, మహిళలు, ప్రజలు, ఎన్నారైలు ఉద్యమించారు. తమ త్యాగమంతా వృథా కాబోతోందని తెలిసి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంతా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. ఎత్తిన జెండా దించకుండా రెండేళ్లు పోరాడారు.
ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో తమకు న్యాయం కావాలంటూ తుళ్లూరు నుంచి తిరుపతికి ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. ఆ శ్రీవారి ఆశీస్సులతో పాలకుల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చి అమరావతే రాజధానిగా కొనసాగించాలని వారంతా వేనోళ్ల మొక్కుకున్నారు. ఆ మొక్కుల ఫలితంగా…నేడు అమరావతే రాజధాని అని హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ క్రమంలోనే న్యాయాన్ని గెలిపించినందుకు గాను ఏపీ హైకోర్టు వద్ద రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి అమరావతి రైతులు సాష్టాంగ నమస్కారం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఆలస్యంగానైనా…న్యాయానిదే అంతిమ విజయమని మరోసారి రుజువైందని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి పోరాటంలో తమకు అడుగడుగునా మద్దతిచ్చిన టీడీపీ సహా అన్నా పార్టీలకు, నేతలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టుకు రైతుల సాష్టాంగ నమస్కారం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.