చిన్న వివాదం.. ఆపై కేసు.. అనంతరం అరెస్టు.. న్యాయస్థానం ఎదుట హాజరు.. జైలుకు తరలింపు.. సింఫుల్ గా ఇష్యూను తేల్చేయొచ్చు. కానీ.. కాస్త విషయం లోతుల్లోకి వెళితే.. ఇదెక్కడి చోద్యం భగవంతుడా? అన్న భావన కలుగక మానదు. విషయం మరింత వివరంగా అర్థం కావాలంటే.. చిన్న ఉదాహరణతో చెప్పేయొచ్చు.
మీరో వీధిలో ఉన్నారు. మీ వీధి సమస్యల మీద మీరు నిరసన తెలుపుతున్నారు. దానికి వ్యతిరేకంగా.. రెండు.. మూడు వీధులకు చెందిన వారు.. మీరు తెలుపుతున్న నిరసనకు వ్యతిరేకంగా నిరసన తెలపవటం కోసం మీ వీధికే వస్తే? మీరేం చేస్తారు? మీరెందుకు మా వీధుల్లోకి వస్తున్నారు? ఒకవేళ మీరు నిరసన చేయాలంటే మీ వీధుల్లోనే చేసుకోవచ్చు కదా? అని ప్రశ్నిస్తారు కదా? అలాంటిదే అమరావతిలోనూ జరిగింది.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అక్కడి రైతులు 300 రోజులకు పైనే నిరసన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వారి నిరసనకు వ్యతిరేకంగా.. మూడురాజధానులకు మద్దతుగా.. ఆ ప్రాంతంతో సంబంధం లేని వారు బయట నుంచి ధర్నా చేయటానికి వస్తుంటే.. స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈపూరి రవిబాబు పోలీసులకు కంప్లైంట్ చేశారు.
గొడవ జరుగుతుంటే సర్ది చెప్పటానికి తాను వెళితే.. రైతులు బెదిరించారంటూ 11 మందిపై కంప్లైంట్ ఇచ్చారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని స్టేషన్ కు రావాలని కబురు పంపారు. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఫిర్యాదు చేసింది ఎస్సీలు.. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎస్సీ.. బీసీలు. స్టేషన్ బెయిల్ తీసుకోవటానికి పోలీస్ స్టేషన్ కు రావాలని పిలిపించి.. అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పర్చారు.
రిమాండ్ రిపోర్టులో.. మూడు రాజధానులకు మద్దతుగా దీక్షలు చేసేందుకు ఆటోల్లో వెళుతున్న వారికి అడ్డంగా 11 మంది ట్రాక్టర్ ను అడ్డుగా పెట్టి గొడవకు దిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్ది చెప్పేందుకు వెళ్లిన ఈపూరి రవిబాబును అసభ్యపదజాలంతో.. కులంపేరుతో దూషించారని పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ.. ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.
న్యాయస్థానంలో నిందితులను హాజరుపర్చగా.. వారికి రిమాండ్ విధించారు. వారిని గుంటూరుజిల్లా జైలుకు తరలించే క్రమంలో చేతికి సంకెళ్లు వేసి.. వేరే నేరాలు చేసిన వారితో కలిపి వాహనంలో తరలించటంపై పలువురు తప్పు పడుతున్నారు. అప్పటి ప్రభుత్వం రాజధాని కోసం భూములు ఇవ్వాలన్న పిలుపుతో తమ భూముల్ని ఇచ్చినందుకు ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
రాజధానిని కాపాడుకోవటం కోసం పోరాటం తమను జైలుకు వెళ్లేలా చేసిందన వేదనను వ్యక్తం చేస్తున్నారు. కులం పేరుతో దూషించినట్లుగా ఫిర్యాదు చేసిన వారికి సంబంధించిన వర్గమే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వర్గం ఒక్కటేనని.. అలాంటప్పుడు ఎస్సీ.. ఎస్టీ వేధింపు నిరోధక చట్టం కింద కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఒక గొడవకు సంబంధించిన కేసులో నిందితులుగా పేర్కొంటున్న రైతులకు సంకెళ్లు వేయాల్సిన అవసరం ఉందా? అన్న మాటను పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విధానం సరికాదంటున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై కుల సంఘాలు.. రాజకీయ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.