ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టింది మొదలు అమరావతి నుంచి రాజధానిని తొలగించాలని కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. అమరవాతి పేరును రూపుమాపేందుకు ప్రజావేదిక విధ్వంసం మొదలు…ఇటీవల పదో తరగతి తెలుగు పాఠ్యాంశాల నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని విద్యా శాఖ తొలగించడం వరకు జగన్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. మూడు రాజధానులంటూ అమరావతిపై కక్ష సాధిస్తున్న జగన్…అమరావతిని ఏపీ మ్యాప్ నుంచి కూడా తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు.
685 రోజులుగా అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతోన్నాకూడా జగన్ కు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అమరావతి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు రైతులు చేపట్టిన ‘మహా పాదయాత్ర’ నేటి నుంచి ప్రారంభమైంది. ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి నేటి నుంచి పాదయాత్ర మొదలుబెట్టింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితోపాటు, న్యాయదేవత విగ్రహాలకు పూజ చేసిన అనంతరం యాత్ర ప్రారంభించారు.
ఈ పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా 45 రోజులు కొనసాగనుంది. నవంబరు 1న తుళ్లూరులో మొదలైన ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. అమరావతి రైతుల మహాపాద యాత్రకు విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. నవంబరు 1 నుంచి 45 రోజుల పాటు రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు హైకోర్టు కూడా అనుమతినిచ్చింది. తుళ్లూరు నుంచి తిరుమలకు చేపట్టిన ఈ పాదయాత్రకు అనుమతిని డీజీపీ నిరాకరించినా…హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యాత్ర ప్రారంభమైంది.
అయితే, యాత్రపై పలు ఆంక్షలను విధించారు.. ఉదయం 6 గం.ల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలోనే పాదయాత్ర చేపట్టాలని, హైకోర్టుకు సమర్పించిన జాబితాలోని 157 మంది సభ్యులు మాత్రమే పాల్గొనాలని చెప్పారు. డీజే సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదని, చిన్న స్పీకర్ మాత్రమే తీసుకెళ్లాలని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకూడదని, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు.
రూట్ మ్యాప్‌ను అనుమతి లేకుండా మార్చకూడదని, రూట్ మ్యాప్ మార్పు చేయాలంటే ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎలాంటి హింసాత్మక, చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడకుండా.. శాంతియుతంగా పాదయాత్ర చేపట్టాలన్నారు. పాదయాత్ర జరిగే ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. మహా పాదయాత్ర వీడియోను చిత్రీకరించాలని.. స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.