కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్న సభలో ప్రసంగించిన గవర్నర్ తమిళిసై గత ప్రభుత్వం పాలనపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నియంతృత్వ పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొందిందని, తెలంగాణ ఇప్పుడు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటోందని తమిళిసై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా గవర్నర్ పై మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఓ సభ్యుడిగా గవర్నర్ ప్రసంగం విని సిగ్గుపడుతున్నానని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ చరిత్రలో అలాంటి ప్రసంగం విని ఉండమని విమర్శించారు. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్టు 50 ఏళ్లుగా దారుణాలన్నీ చేసి పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయించారని కాంగ్రెస్ పై కేటీఆర్ విరుచుకుపడ్డారు. నిన్నటి గవర్నర్ ప్రసంగం తర్వాత రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చేసిందని కేటీఆర్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల ముందుకు వాస్తవాలు తీసుకువెళ్లాల్సిన బాధ్యత తమకు ఉందని, తప్పకుండా నిజాలు బట్టబయలు చేస్తామని కేటీఆర్ అన్నారు. ఒక నక్క ఎవరినీ మోసం చేయనని ప్రమాణ స్వీకారం చేసిందని, ఓ పులి తోటి జంతువులను సంహరించినందుకు పశ్చాత్తాపం ప్రకటించిందని అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవితను కేటీఆర్ ఉటంకించారు.
గవర్నర్ ప్రసంగం కూడా ఆ మాదిరిగానే ఉందని ఆరోపించారు. ప్రజలకు స్వపక్షం..కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పటికీ విపక్షమేనని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సోనియాను బలిదేవత అన్నది ఎవరో అందరికీ తెలుసు అంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపుతున్నాయి. మేనిఫెస్టోలో హామీలు అమలు చేయాలని, తమ ఖాతాలలో 2500 రూపాయలు ఎప్పుడు వేస్తారని రాష్ట్రంలోని కోటిన్నర మంది మహిళలు ఎదురు చూస్తున్నారని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పాలన విధ్వంసం అంటే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఏమనాలని కేటీఆర్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి మూడు నెలల సమయం ఇద్దామని కేసీఆర్ చెప్పారని అన్నారు.