టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేటి నుంచి యువగళం పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కుప్పం నుంచి పాదయాత్ర మొదలుబెట్టిన లోకేష్ అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై లోకేష్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు దేవుడని, రాముడు లాంటి వాడిని, కానీ తాను మాత్రం వైసిపి నేతలు పాలిట రాక్షసుడినని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ నేతలు చేసిన అరాచకాలు, అక్రమాలకు వడ్డీ, చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని హెచ్చరించారు. కుప్పంలో అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన ప్రతి రూపాయి కక్కిస్తానని, ఆ డబ్బు పేదవారికి చేరేలా చేస్తానని అన్నారు. చంద్రబాబు ఏడోసారి కూడా కుప్పంలో గెలిచారు కనుకనే ఈరోజు కుర్రకుంకలకు నోరు లేస్తోందని అన్నారు. జగన్ అమూల్ పాలు తాగేటప్పుడు ఇజ్రాయిల్ టెక్నాలజీతో కుప్పంలో డ్రిప్ ఇరిగేషన్ తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదని లోకేష్ గుర్తు చేశారు.
613 కోట్ల రూపాయల భారీ వ్యయంతో హంద్రీనీవా పనులు 90 శాతం పూర్తిచేసిన అపర భగీరథుడు చంద్రబాబు అని కొనియాడారు. ఈ మూడున్నరేళ్లలో మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడం జగన్ కు చేతకాలేదని దుయ్యబట్టారు. 100 కోట్ల వ్యయంతో పేదల కోసం చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టును సైకో జగన్ ఆపేశాడని మండిపడ్డారు. మోడల్ కాలనీ రింగ్ రోడ్డు పనులను కూడా ఈ సైకో సీఎం నిలిపివేశాడని, కుప్పానికి ఆర్టీసీ బస్సులు కూడా తగ్గించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంపై వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే 1300 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని, ఆ తర్వాతే కుప్పం వచ్చి ఓట్లు అడగాలని లోకేష్ ఛాలెంజ్ చేశారు.