ఏపీలో సినిమా టికెట్ల రేట్లు, ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై ఇటీవలే జగన్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకోవడంతో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక, తాజాగా సినిమా టికెట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఏపీలో ఆన్లైన్ టికెటింగ్ విధానం అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఆన్ లైన్ టికెటింగ్ కోసం టెండర్ల ప్రక్రియను కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇతర ప్రైవేట్ సంస్థల కంటే తక్కువ ధరకే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తైన టెండర్లలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేష్ కు చెందిన జస్ట్ టిక్కెట్ సంస్థ L-1గా నిలిచినట్లు ప్రచారం జరుగుతోంది. జస్ట్ టిక్కెట్ కు పోటీగా బుక్ మై షో సంస్థ పోటీపడ్డట్లు తెలుస్తోంది. అన్ని థియేటర్లు ఆ టెండరు దక్కించుకున్న సంస్థ ద్వారా టిక్కెట్ల ఆన్ లైన్లో అమ్మకాలు చేపట్లేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
ప్రేక్షకులపై ఆన్లైన్ చార్జీల భారం లేకుండా ప్రభుత్వం ఈ ఆన్ లైన్ టికెటింగ్ విధానం రూపొందించిందని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రేక్షకులపై టికెట్స్ రేట్స్ భారం తగ్గే అవకాశముంది. అయితే, ఆన్లైన్లో టికెట్స్ విక్రయించగా వచ్చిన డబ్బును ప్రభుత్వమే డిస్టిబ్యూటర్లకు, థియేటర్ల యజమానులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయంతో బ్లాక్ టికెట్ల ధందాకు చెక్ పడడమే కాకండా, టికెట్స్ విషయంలో ప్రేక్షకులను ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.