మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలొచ్చారు. వాళ్లలో చాలామంది సక్సెస్ అయ్యారు. ఐతే అందరిలోకి పెద్దగా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయిందంటే అల్లు శిరీష్ అనే చెప్పాలి. ముందు ప్రొడక్షన్లో అనుభవం సంపాదించి.. ఆ తర్వాత హీరోగా మారిన శిరీష్ కు కెరీర్ ఆరంభంలో షాకుల మీద షాకులు తగిలాయి. మధ్యలో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో బ్రేక్ అందుకున్నప్పటికీ.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు.
ఒక్క క్షణం, ఏబీసీడీ సినిమాలు అతడికి నిరాశనే మిగిల్చాయి. దీంతో కెరీర్ డౌన్ అయిపోయింది. రెండేళ్లకు పైగా అతను వార్తల్లో లేడు. గత ఏడాది అను ఇమ్మాన్యుయెల్ కథానాయికగా, ‘విజేత’ దర్శకుడు రాకేశ్ శశి దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. కానీ అది ఎంతకీ పూర్తి కాలేదు. గతంలో టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ అయినపుడు తప్పితే.. ఈ సినిమా గురించి చర్చే లేదసలు.
ఈ చిత్రానికి ప్రేమ కాదంట అనే టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టైటిల్ కొంచెం గమ్మత్తుగా ఉండి, ఫస్ట్ లుక్ కూడా బాగానే అనిపించింది జనాలకు. కానీ తర్వాత సినిమాను వార్తల్లో నిలబెట్టలేకపోయారు. షూటింగ్ అప్డేట్ లేదు. రిలీజ్ ముచ్చటా వినిపించలేదు. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ ఈ సినిమా గురించి అఫ్ డేట్ ఇచ్చారు. నవంబరు 4న సినిమా విడుదలవుతందట. ఐతే ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ మీడియాలో ఎక్కడా టైటిల్ ఊసు లేదు.
శిరీష్ కొత్త సినిమా అంటున్నారే తప్ప టైటిల్ ప్రస్తావించట్లేదు. బహుశా సినిమాకు పేరు మారి ఉంటుందని భావిస్తున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో రిలీజ్ అని కూడా మీడియాలో వార్తలు వస్తుండడం విశేషం. మరి ఈ సినిమాకు సంబంధించి ఏమేం మార్పులు జరిగాయా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవిందే స్వయంగా నిర్మిస్తున్నారు.