ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ లెక్కల మాస్టారు, విలక్షణ దర్శకుడు సుకుమార్ ల కాంబోలో తెరకెక్కిన పుష్ప-ది రైజ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఎర్ర చందనం స్మగ్లర్ పుష్పరాజ్ గా బన్నీ రగ్డ్ లుక్, పర్ఫార్మెన్స్,…కథా, కథనం, పాటలు…ఇలా అన్ని విషయాల్లో సుకుమార్ లెక్క తప్పలేదు.
అందుకే, పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. తొలి రోజు రూ.71 కోట్లు కొల్లగొట్టిన పుష్ప…రెండో రోజు రూ.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సండే సందడితో కలుపకొని మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.150 కోట్ల మార్క్ దాటి ఉంటుందని అంచనా. ఇక, ఈ రేంజ్ లో రికార్డు వసూళ్లు రాబడుతోన్న ఈ చిత్రానికి అదే రేంజ్ లో రెమ్యున్ రేషన్ కూడా వసూలు చేశాడట బన్నీ.
పుష్పరాజ్ గా డీగ్లామరైజ్డ్ గా నటించేందుకు బన్నీ ఏకంగా రూ.50 కోట్లు తీసుకున్నాడని టాక్ వస్తోంది. దర్శకుడు సుకుమార్ పాతిక కోట్లు పట్టేశాడట. ఇక, శ్రీవల్లిగా అదరగొట్టిన రష్మిక మందన్నా రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు చార్జ్ చేసిందట. విలన్గా అద్భుతంగా నటించిన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ రూ.3.5 కోట్లు పుచ్చుకున్నాడట. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రూ.3.5 కోట్లు, ఐటం సాంగ్ తో చిందేసిన సమంత రూ.1.5 కోట్లు తీసుకున్నారట.