ఇటీవల అల్లు అర్జున్ కూడా రాపిడో బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ అప్ చేశారు. రాపిడో ఒక బైక్ టాక్సీ అగ్రిగేటర్ మరియు లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్. అయితే, ఈ సంస్థ చేసిన మిస్టేక్ వల్ల అల్లు అర్జున్ ఇరుక్కుపోయాడు. ఒక బ్రాండ్ ప్రమోషన్లో మరో వ్యవస్థను, సంస్థను నేరుగా ప్రభావం చేసేలా ప్రకటన తయారుచేయకూడదన్న చిన్న రూల్ ను మరిచిపోయిన సంస్థ అల్లు అర్జున్ ను ఇరికించింది. తెలంగాణ ఆర్టీసీ అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ర్యాపిడో ప్రకటనలో అల్లు అర్జున్ చేసిన కామెంట్లే దీనికి కారణం. అసలే ఇపుడు అక్కడ ఉన్నది సజ్జనార్. ఆయన దేన్నీ లైట్ తీసుకోరు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఎండీ సజ్జనార్ తాజాగా దీనిపై ప్రెస్ నోట్ విడుదల చేశారు.
“టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నటించిన రాపిడో ప్రకటన అభ్యంతరకరంగా ఉంది. యూట్యూబ్‌లో ప్రసారం అవుతున్న ప్రకటనలో, RTC బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా మరియు సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ఆ యాడ్ లో చెబుతాడు. ఈ ప్రకటన RTC ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది, రిటైర్డ్ సిబ్బందితో పాటు అందరరినీ నొప్పించేలా ఉంది. ర్యాపిడో సర్వీస్‌తో పోల్చి ఆర్టీసీ సంస్థను తక్కువ చేయడం, వ్యాపార సూత్రానికి విరుద్ధంగా ప్రకటన చేయడం ఖండిస్తున్నాం‘‘ అంటూ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు.
TSRTC అల్లు అర్జున్ కి, ప్రకటనను ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు పంపుతుందని కూడా అందులో పేర్కొన్నారు. ప్రజా రవాణా మరియు ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే కంటెంట్‌ను ప్రచారం చేయకుండా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా మంచి హోదాలో ఉన్న నటీనటులు, సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తులు ప్రవర్తించవద్దని సజ్జనార్ కోరారు.