మామకు మద్దుతగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఆ మామ.. తన మేనత్త భర్త చిరంజీవి కాదు. అలా అని ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా కాదు. మరి ఇంకెవరంటారా? తనకు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కోసం అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం చేసేందుకు రెడీ అయినట్లు టాక్.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడిగా కొనసాగుతున్న కంచర్ల చంద్రశేఖర్రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. చంద్రశేఖర్రెడ్డి గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి. అయితే ఈ సారి ఎన్నికల్లో చంద్రశేఖర్రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది.
ఇప్పటికే ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన చంద్రశేఖర్రెడ్డి ఇక్కడ తెగ తిరిగేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఆగస్టు 19 నుంచి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలను ఆయన మొదలెట్టబోతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాల్లో అల్లుడు అల్లు అర్జున్ను కూడా భాగం చేయాలని చంద్రశేఖర్రెడ్డి ప్లాన్ వేసినట్లు తెలిసింది.
పుష్ఫ సినిమాతో దేశాన్ని ఉపేసిన అల్లుడు అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి వస్తే తనకు కలిసొస్తుందని చంద్రశేఖర్రెడ్డి భావిస్తున్నారు. మరోవైపు పుష్పరాజ్ కూడా తన మామ కోసం ప్రచారంలో భాగమయేందుకు సరేనన్నారని టాక్. మరి పుష్పరాజ్ అడుగుపెడితే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎలాంటి సౌండ్ వినిపిస్తుందో చూడాలి.