సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వ్యవహారం ఇప్పుడు ఎంత పెద్ద అంశంగా మారిందో తెలిసిందే. ఈ కేసు విషయమై అల్లు అర్జున్ అరెస్టు తర్వాతి పరిణామాలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. బెయిల్ మీద బయటికి వచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతం పోలీసుల విచారణకు హాజరవుతున్నాడు. ఈ కేసులో తదుపరి పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్.. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత పిల్లాడు శ్రీ తేజ్‌ను చూసేందుకు వచ్చారు.
ప్రమాదంలో శ్రీతేజ్ తల్లి రేవత్ ఘటన జరిగినపుడే చనిపోగా.. ఆ పిల్లాడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. మెదడు దెబ్బ తిన్న అతణ్ని మామూలు మనిషిని చేసేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్‌ను చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు అల్లు అరవింద్.
శ్రీతేజ్ కోలుకుంటున్నాడని.. అతను త్వరలోనే మామూలు మనిషి అవుతాడని అరవింద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అతడి వైద్య పరిస్థితిని మొదట్నుంచి తాము ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నామని.. తన కుటుంబ బాధ్యతను తాము తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఇక శ్రీతేజ్ కుటుంబానికి ఇంతకుముందు ప్రకటించినట్లు అల్లు అర్జున్ రూ.25 లక్షల సాయంతో సరిపెట్టడం లేదని అరవింద్ వెల్లడించారు.
బన్నీ తరఫున రూ.కోటి సాయాన్ని ఆయన ప్రకటించారు. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించగా.. దర్శకుడు సుకుమార్ సైతం రూ.50 లక్షల సాయం అందిస్తున్నట్లు అరవింద్ వెల్లడించారు. మొత్తంగా ‘పుష్ప-2’ టీం నుంచి రూ.2 కోట్ల సాయం అందుతోంది బాధిత కుటుంబానికి. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి రూ.25 లక్షల సాయం అందించారు. దీంతో పాటు శ్రీతేజ్ వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తోంది. అందుకోసం బన్నీ కూడా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.