మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహం చల్లారినట్లే కనిపిస్తోంది. జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్‌ను దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో గత ఏడాది వేసవిలో ‘వకీల్ సాబ్’ సినిమాకు ఉన్నట్లుండి టికెట్ల రేట్లు తగ్గించేసి పైశాచిక ఆనందం పొందింది జగన్ సర్కారు.
ముందు పవన్నే టార్గెట్ చేసినా.. ఆ తర్వాత ఆ సమస్య కాస్తా ఇండస్ట్రీ మెడకు చుట్టేసుకుంది. పవన్‌ను ఒక్కడినే ఇబ్బంది పెడితే సరిపోదనుకుందో ఏమో కానీ.. జగన్ సర్కారు ఆ తర్వాత మొత్తం ఇండస్ట్రీనే వేధించడం మొదలుపెట్టింది.
టికెట్ల రేట్లు తగ్గించడమే కాక.. కేవలం సినిమాలను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో నైట్ కర్ఫ్యూ పెట్టి సెకండ్ షోలు రద్దు చేయించడం.. ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం లాంటివి చేసింది. తాను ముఖ్యమంత్రి అయ్యాక సినిమా వాళ్లెవ్వరూ తనకు సరైన గౌరవం ఇవ్వట్లేదని.. శుభాకాంక్షలు చెప్పడం.. తనకు సన్మానాలు చేయడం లాంటివి చేయడకపోవడంతో తనను వాళ్లంతా సీఎంగా గుర్తించట్లేదనే భావనలో జగన్ ఉన్నట్లు చెబుతారు.
ఈ నేపథ్యంలోనే ఈ టికెట్ల రేట్ల అంశాన్ని పట్టుకుని దాన్నో పెద్ద సమస్యగా మార్చి.. మొత్తం ఇండస్ట్రీ తనకు సాగిల పడేలా చేయాలనుకున్నారు. ఐతే ఆయన లక్ష్యం కొంతమేర నెరవేరింది. చిరంజీవి, దిల్ రాజు సహా కొందరు ప్రముఖులు ఆయన శరణుజొచ్చారు. అయినా జగన్‌కు సంతృప్తి దక్కలేదు. మరిందరు ప్రముఖులు తనను కలిసి సమస్య పరిష్కారం కోసం విన్నపాలు చేస్తే చూడాలనుకున్నారు.
ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ లాంటి సెలబ్రెటీలు గురువారం చిరంజీవితో కలిసి వెళ్లి చిరంజీవిని కలిశారు. అందరూ ఏపీ సీఎంను పొగడ్తల్లో ముంచెత్తారు. సమస్య పరిష్కారం కోసం విన్నవించుకున్నారు. అలాగే ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ట్వీట్లు వేశారు. ఇప్పుడు జగన్ ఇగో కొంత చల్లారినట్లే కనిపిస్తోంది. కానీ ఇంతగా ఒత్తిడి తెచ్చినా టాలీవుడ్ నుంచి ఎక్కువమందిని తన దగ్గరికి రప్పించుకోలేకపోయాడు జగన్.
ముఖ్యంగా సినీ రంగంలో తన ప్రధాన శత్రువుగా భావిస్తున్న పవన్ కళ్యాణ్.. అలాగే నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్.. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ లాంటి అగ్ర కథానాయకులు జగన్ దగ్గరికి రాలేదు. ఎంత ఒత్తిడి తెచ్చినా పవన్, బాలయ్య, ఎన్టీఆర్ లాంటి వాళ్లు జగన్ దగ్గరికి వచ్చే అవకాశమే లేదు. వాళ్లకు రాజకీయాలతో ఉన్న సంబంధాలే కారణం. అల్లు అర్జున్ సైతం తగ్గేదే లే అనే రకం కాబట్టి జగన్ దగ్గరికి వచ్చి విన్నపాలు చేసే ఛాన్సే లేదు. మరి జగన్ వీరి దగ్గర తన దమ్ము చూపించలేకపోయాడన్నది స్పష్టం కదా?