ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడిగా ఉంటూ.. అభిమానులు ప్రస్తావన వచ్చినపుడల్లా ‘మెగా’ అనే పదం వాడుతూ వచ్చిన అల్లు అర్జున్.. కొన్నేళ్ల నుంచి రూటు మార్చేశాడు. తన అభిమానులను ‘ఆర్మీ’ అని సంబోధిస్తూ.. సొంత ఇమేజ్ను బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తన ఎంట్రీకి, కొంత మేర స్టార్ ఇమేజ్ రావడానికి ‘మెగా’ బ్రాండ్ ఉపయోగపడిప్పటికీ.. ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా తాను ఎదగడం వెనుక సొంత కష్టం చాలా ఉందని బలంగా నమ్ముతున్న బన్నీ.. తన మాటల్లో, చేతుల్లో స్పష్టంగా ఆ విషయం కనిపించేలా చేస్తున్నాడు.
బలమైన పీఆర్ టీంను పెట్టుకుని సోషల్ మీడియాలో తనకు సరైన ఎలివేషన్ వచ్చేలా చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ టీం భారీ స్థాయిలో ‘దేశముదురు’ స్పెషల్ షోలు ప్లాన్ చేసింది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూసి అందరూ షాకయ్యారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో ‘దేశముదురు’ షోకు బుకింగ్స్ మొదలుపెడితే రెండు మూడు నిమిషాల్లో టికెట్లన్నీ అయిపోవడం విశేషం. దీని వెనుక పీఆర్ టీం మహత్మ్యం ఉందన్న చర్చ జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే ఈ రోజు స్పెషల్ షోల ప్రదర్శన సందర్భంగా థియేటర్లలో బన్నీ అభిమానులు మామూలు సందడి చేయలేదు.
పవన్ కళ్యాణ్ సినిమా ‘జల్సా’, మహేష్ బాబు మూవీ ‘పోకిరి’ రిలీజైనపుడు థియేటర్లలో ఎంతటి హంగామా కనిపించిందో దానికి ఏమాత్రం తగ్గని విధంగా హంగామా చేశారు. ఒక థియేటర్లో ఏకంగా బాణసంచా కాల్చడంతో రచ్చ రచ్చ అయింది. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇక వివిధ థియేటర్లలో బన్నీ ఇంట్రో సీన్‌కు నెలకొన్న హంగామాకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి బన్నీ క్రేజ్ ఏంటో చూపించడానికి పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగారని.. బన్నీ అభిమానులు ‘మాస్’ అంటే ఏంటో చూపించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతను్నాయి.