ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడేలా చేసిన సినిమా అంటే.. ‘ఏజెంట్’ అనే చెప్పాలి. ఈ సినిమాను ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్లో తీసినట్లు నిర్మాత అనిల్ సుంకర చెప్పుకున్నారు. చివరికి చూస్తే ఈ చిత్రం రూ.8 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయింది. మార్నింగ్ షోల నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఏ దశలోనూ పుంజుకోలేకపోయింది. ‘ఏజెంట్’ మూవీతో దర్శకుడు సురేందర్ రెడ్డికి వచ్చిన చెడ్డ పేరు అంతా ఇంతా కాదు. ఇటు నిర్మాత, అటు హీరో ఇద్దరూ కూడా ‘ఏజెంట్’ ఫెయిల్యూర్‌కు సురేందర్దే బాధ్యత అన్నట్లుగా వ్యవహరించారు రిలీజ్ తర్వాత. ప్రేక్షకులు కూడా సురేందర్‌ను మామూలుగా తిట్టలేదు.
అన్ని వనరులూ ఉన్నా అతను ఉపయోగించుకోకుండా చెత్త సినిమా తీశాడని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో సురేందర్‌ను నమ్మి తర్వాతి ఛాన్స్ ఎవరిస్తారా అన్న చర్చ నడిచింది.
ఐతే ట్రాక్ రికార్డు కాకుండా టాలెంట్ మాత్రమే చూసే గీతా ఆర్ట్స్ సంస్థ.. సురేందర్‌ను నమ్మి సినిమా చేయడానికి రెడీ అవుతోంది. గతంలో పరశురామ్ సహా చాలామంది దర్శకులు ఫెయిల్యూర్లలో ఉండగా గీతాలో సినిమా చేసి హిట్ కొట్టారు. సురేందర్‌కు కూడా అలాగే ఛాన్స్ ఇవ్వాలని అల్లు అరవింద్ ఫిక్సయినట్లున్నారు. తమ బేనర్లో సురేందర్ సినిమా ఉంటుందని ఆయన తాజాగా ‘2018’ సక్సెస్ మీట్లో ప్రకటించారు.
సూరి తమ సంస్థలో చేసే సినిమాకు స్క్రిప్టు వర్క్ జరుగుతోందని.. అన్నీ ఫిక్సయ్యాక సినిమా అనౌన్స్ చేస్తామని అరవింద్ వెల్లడించారు. మొత్తానికి గీతాలో సురేందర్ సినిమా అయితే కన్ఫమ్ అయినట్లే. మరి అది అల్లు అర్జున్‌తో ఉంటుందా.. ఇంకో హీరోతోనా అన్నదే తేలాల్సి ఉంది. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘రేసు గుర్రం’ బ్లాక్ బస్టర్ అయింది. మరి ఇప్పుడు అరవింద్ లాగే బన్నీ కూడా సూరి ట్రాక్ రికార్డు చూడకుండా స్క్రిప్టును మాత్రమే నమ్మి సినిమా చేస్తాడేమో చూడాలి.