దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’.. దానికి పోటీగా వచ్చిన మిగతా రెండు చిత్రాలను పూర్తిగా వెనక్కి నెట్టి.. ఐదు రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేసింది. రిలీజ్ రోజు బుధవారం నుంచి ఆదివారం వరకు నిలకడగా వసూళ్లు సాగాయి. కానీ వీకెండ్ అవ్వగానే ఒక్కసారిగా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. సోమవారం నుంచి రోజు రోజుకూ వసూళ్లు పడుతూ వచ్చాయి. ఐతే గత వీకెండ్లో తెలుగులో చాలా సినిమాలు రిలీజయ్యాయి కానీ.. .అవేవీ తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి.
ముందు నుంచే వాటికి బజ్ లేకపోవడంతో రెండో వారాంతంలో ‘గాడ్ ఫాదర్’ బాగా పుంజుకుంటుందని, మంచి షేర్ వస్తుందని అంచనా వేశారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక కన్నడ డబ్బింగ్ సినిమా వచ్చి ‘గాడ్ ఫాదర్’ వసూళ్లకు గండి కొట్టేసింది. ఆ చిత్రమే.. కాంతార. ‘కాంతార’ కన్నడ వెర్షన్‌కు తెలుగులో వస్తున్న రెస్పాన్స్ చూసి దాని మేకర్స్, అలాగే అల్లు అరవింద్ కలిసి ఈ చిత్రాన్ని చకచకా అనువదించేశారు. ఆలస్యం చేయకుండా గత శనివారం విడుదలకు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమను తెలుగులో పెద్దగా ప్రమోట్ చేసింది కూడా లేదు. అప్పటికే కన్నడ వెర్షన్‌కు వస్తున్న స్పందన చూసి, ముఖ్యంగా దీని క్లైమాక్స్ గురించి జరిగిన చర్చను గమనించి తెలుగు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగింది.
సినిమాకు తెలుగులో అదిరిపోయే టాక్, రివ్యూలు రావడంతో పెద్ద ఎత్తున జనం థియేటర్లకు కదిలారు. రెండు రోజుల్లో ఈ సినిమా రూ.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటే అది ఏ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందో అర్థం చేసుకోవచ్చు. రెండో వీకెండ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గాడ్ ఫాదర్’కు ‘కాంతార’ పెద్ద షాకే ఇచ్చింది. ఈ వారం ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ‘కాంతార’నే అయింది. మొత్తం ప్రేక్షకులు ఇటు మళ్లడంతో ‘గాడ్ ఫాదర్’ పెద్దగా పుంజుకోలేదు. ఈ చిత్రాన్ని తన బేనర్ మీద పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం ద్వారా అల్లు అరవింద్ తనకు తెలియకుండానే చిరు చిత్రాన్ని గట్టి దెబ్బే కొట్టాడని చెప్పాలి.