యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `తండేల్`. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పర్ణలో బన్ని వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న తండేల్ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. యదార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నాగ చైతన్య రాజు అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నాడు. అతని ప్రేయసి సత్య పాత్రలో సాయి పల్లవి అలరించబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తండేల్ పై తారా స్థాయిలో అంచనాలు ఏర్పడేలా చేశారు. ప్రచార కార్యక్రమాలతో చిత్రబృందం మరింత హైప్ పెంచుతోంది.
అయితే తాజాగా నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తండేల్ గురించి ఎన్నో విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ సాయి పల్లవిపై హాట్ కామెంట్స్ చేశారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. `తండేల్ లో సాయి పల్లవి ఎంపిక పూర్తిగా నా నిర్ణయమే. ఆమె పోషించిన సత్య పాత్ర కోసం నేను ముంబై హీరోయిన్లను తీసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే, ఆ పాత్ర ఎన్నో భావోద్వేగాలతో కూడినది. చిరకాలం ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. అటువంటి పాత్ర చేయడానికి కేవలం తెల్ల తోలుంటే సరిపోదు. చాలా నిజాయతీగా, సహజంగా చేయాలి.
ముంబై నుంచి వచ్చిన వైట్ స్కిన్ అమ్మాయిలు ఈ పాత్రకు జీవం పోయాలేరనిపించింది. కానీ సాయి పల్లవి ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగలదు. ఆమె అసాధారణమైన నటి. అందుకే తండేల్ లో సాయి పల్లవిని ఎంపిక చేశాం. అనుకున్నట్లే ఆమె తన పాత్ర కోసం వంద శాతం ఇచ్చింది. సాయి పల్లవి నటన తెరపై ప్రేక్షకులను మిస్మరైజ్ చేస్తుంది` అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా, తండేల్ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీలో దేవిశ్రీ స్వరపరిచిన `బుజ్జి తల్లి`, `శివ శక్తి`, `హైలెస్సో హైలెస్సా` ఇప్పటికే బటయకు వచ్చి విశేషమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి.