ఇటీవలె లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ కార్కొరేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. ఇకపై జగన్ 2.O ను చూస్తారంటూ డైలాగ్స్ వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని.. వారి కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తానంటూ హెచ్చరించారు.
ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసారి మనదే అధికారం అన్నారు జగన్. ఈసారి అధికారంలోకి వచ్చాక మరో 30 ఏళ్ల పాటు మనమే ఉంటామని జోస్యం కూడా చెప్పారు. అయితే జగన్ 2.O పై టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. ఢిల్లీలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో లోకేష్ చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే జగన్ చేసిన 2.O కామెంట్స్ ను మీడియా ప్రతినిధులు లోకేష్ దృష్టికి తీసుకురాగా.. ఆయన ఘాటుగా సెటైర్స్ పేల్చారు.
జగన్ ఇప్పుడు 2.O అంటున్నారు, కానీ జగన్ 1.O నుంచే రాష్ట్ర ప్రజలు ఇంకా కోలుకోలేదంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ 1.O తో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 1.O నుండి బయటపడేందుకు కనీసం 30 ఏళ్ల సమయం పట్టేలా ఉందంటూ జగన్ పరువును లోకేష్ అడ్డంగా తీసేశారు. అక్రమ కేసులు నమోదు చేసి ఇతర పార్టీ నాయకులను, కార్యకర్తలను దారుణంగా హింసించిన విషయం ఇంకా ఎవరు మర్చిపోలేదని లోకేష్ గుర్తు చేశారు.
సూటిగా మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాను. గత ఐదు ఏళ్లల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని. మేము ఎనిమిది నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? అనే దానిపై చర్చకు నేను సిద్ధం. జగన్ సిద్ధంగా ఉన్నారా? అంటూ లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు జగన్ 2.O ను భరించే స్థితిలో లేరని లోకేష్ తేల్చి చెప్పారు.