2020లో ప్రపంచ దేశాలతో కరోనా మహమ్మారి 20-20 మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. కరోనా పించ్ హిట్టింగ్ కు అగ్రరాజ్యం అమెరికా దగ్గర నుంచి అనామక దేశం ఐర్లాండ్ వరకు విలవిలలాడాయి. పదునైన యార్కర్లతో కరోనాను వ్యాక్సిన్ క్లీన్ బౌల్డ్ చేస్తుందనుకున్న జనం ఆశలపై కరోనా సెకండ్ వేవ్ నీళ్లుచల్లింది. మొదటి వేవ్ తో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ మ్యాచ్ మాదిరిగా భారీ సంఖ్యలో కేసులతో విరుచుకుపడుతోంది.
ఈ క్రమంలోనే భారత్ లోనూ కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మన దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. అగ్రరాజ్యం అమెరికాతో పోలిస్తే ఇండియాలో 3 రెట్ల కేసులు అధికంగా నమోదు కావడం కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 2,61,500 మంది కరోనా బారిన పడడం ఆల్ టైం రికార్డ్. తాజా కేసులతో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య కోటి 47 లక్షల 88 వేల 109కి చేరింది.
శనివారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 1501 మందిని కరోనా పొట్టనబెట్టుకుంది. తాజా మరణాలతో కలిపి మొత్తం మరణాల సంఖ్య 1,77,150కి చేరింది. తాజా కేసులతో ప్రస్తుతం దేశంలో 18 లక్షల 1316 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో మహారాష్ట్ర, ఢిల్లీలో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 24,375 మంది, మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 67,123 మంది కరోనా బారిన పడ్డారు.