- ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో భేటీ
- ఈ సమావేశం జరక్కుండా జగన్ విశ్వప్రయత్నాలు
- పీఠాధిపతుల చుట్టూ మంత్రి ప్రదిక్షణలు
- ఫలించని రాయబారాలు!
దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఉంది జగన్ ప్రభుత్వం తీరు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, దేవతావిగ్రహాలపై దాడులు చేస్తున్నవారిని పట్టుకోకుండా ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబే దాడులు చేయుంచారని కువిమర్శలకు దిగుతోంది. అంతటితో ఆగకుండా దీనివెనుక కొందరు టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఉన్నారని సాక్షాత్తూ డీజీపీతో ప్రకటన చేయించింది. దానిని సమర్థించుకోవడానికి రాజమండ్రిలో ఒక పూజారికి., ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తలో 40 వేలు ఇచ్చి.. తామే చేశామని చెప్పించింది.
శ్రీకాకుళం జిల్లాలో ఓ దేవాలయం వద్ద ఉన్న నంది విగ్రహం స్థానంలో వైఎస్ విగ్రహం పెట్టాలని చూసి.. స్థానికులు అందుకు అంగీకరించకుండా కొత్త నంది విగ్రహం ప్రతిష్ఠిస్తే.. మంచి ముహూర్తం చూడకుండా పెట్టారని కేసులు నమోదు చేయించిన ఘనత జగన్ సర్కారుకే చెల్లింది. జగన్ సీఎం అయ్యాక ఈ 20 నెలల్లో కనీసం 140 ఆలయాలపై దాడులు జరిగాయి.
ప్రఖ్యాత రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తలనరికివేత సహా 27 చోట్ల దేవతా విగ్రహాల ధ్వంసం జరిగింది. నెల్లూరులో, అంతర్వేది ఆలయంలో ఊరేగింపు రథాలను బుగ్గిచేశారు. బెజవాడ కనకదుర్గమ్మ రథంపై వెండి విగ్రహాలను తస్కరించారు. చాలా విగ్రహాలను తానే ధ్వంసం చేయించానని, హిందూ దేవుళ్లు ఫేక్ అని, ఊళ్లకు ఊళ్లనే క్రైస్తవ మతంలోకి మార్చేశానని, ఇప్పటికి 699 గ్రామాలను ఇలా మార్చానని కాకినాడ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఏకంగా వీడియోనే విడుదల చేసినా.. అతడిని ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది.
రాష్ట్రమంతటా నిరసనలు వెల్లువెత్తడంతో.. ఆర్రోజుల తర్వాత అతడి నివాసాలు, కాలేజీల్లో సోదాలు చేశారు. ఏవో స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు చెప్పినా.. అతడిని అరెస్టు చేయలేదు. చివరకు ఆందోళనలు మిన్నుముట్టే సరికి కోర్టు ద్వారా కస్టడీకి తీసుకున్నారు. రహస్యంగా విచారిస్తున్నామన్నారు.. వివరాలు బయటకు పొక్కలేదు. కాకినాడకు చెందిన అతడికి కడపలో బ్యాంకు ఖాతా ఉన్నట్లు తేలింది. అంతేకాదు జగన్ బావ అనిల్‌కుమార్‌కు ప్రవీణ్ సన్నిహితుడనీ బయటపడింది. కానీ ప్రభుత్వం స్పందంచకపోవడంతో క్రమంగా పీఠాధిపతులు కూడా గళం విప్పడం మొదలుపెట్టారు.
దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు నోరెత్తని వీరు… పాస్టర్‌ను బయటపడేసేందుకు జగన్ సర్కారు చేసే ప్రయత్నాలు చూశాక కూడా తాము స్పందించకపోతే.. జగన్ నుంచి విరాళాలు పొందుతున్న కారణంగానే తాము నోరు తెరవడం లేదని జరుగుతున్న ప్రచారం నిజమేనని తమ భక్తులు, ప్రజలు భావిస్తారన్న భయంతోనేమో.. వివిధ మఠాలు, పీఠాధిపతులు తిరుపతి సమీపంలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో ఓ గ్రామంలో సమావేశమయ్యారు. దేవాలయాలు, దేవతావిగ్రహాలకు జరుగుతున్న అపచారాలను తీవ్రంగా గర్హించారు. పవిత్ర దేవతా మూర్తుల విగ్రహాల విధ్వంసం పథకం ప్రకారమే జరుగుతోందన్న భావన వ్యక్తం చేశారు.
మంత్రి, ఎమ్మెల్యే రాయబారం విఫలం..
రథాలు తగుల బడితే తేనేటీగలు కారణమని, ఆలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి చర్య అని, విగ్రహాల విధ్వంసానికి గుప్తనిధుల వేటగాళ్ల పనేనని రాష్ట్రంలో వరుస ఘటనలపై ప్రభుత్వం వివరణ ఇస్తోంది. ఇదే సమయంలో ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే రక్తం వస్తుందా..? రాముడి విగ్రహ తల తెగిపడితే ప్రాణం పోతుందా.. అని మంత్రి కొడాలి నాని లాంటి వారి వ్యాఖ్యలు.. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ నివాసానికి సమీపంలో బెజవాడ కనకదుర్గమ్మ రథ వెండి సింహాల మాయంపై పొంతనలేని వ్యాఖ్యలు చేసిన పాలకుల తీరును కొన్ని నెలలుగా పీఠాధిపతులు, సాధుసంతులు గమనించారు.
ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థంలో డిసెంబరు ఆఖరి వారంలో రాముడి విగ్రహం తలనరకడం తీవ్ర దుమారం రేపింది. ఇలాంటి చర్యలతో పాటు జగన్ ప్రభుత్వం పాస్టర్లకు ఇస్తున్న తాయిలాలు, క్రైస్తవ మిషనరీలు అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తుండడం, హిందూ ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం అవుతుండడం లాంటి వాటిపై హిందూ సంఘాలతో సమాచారం తెప్పించుకున్న పీఠాధిపతులు కార్యాచరణకు రంగంలోకి దిగారు.
ఓ వైపు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోంటే మరోవైపు ఉత్తరాంధ్రలో ఆయోధ్యగా పేరుగాంచిన రామతీర్థం ఆలయంలో స్వామివారి శిరో భాగం ఖండించి పుష్కరిణిలో వేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. రాముడు నడియాడిన పుణ్యభూమిలో రాముడికే శిరచ్ఛేదం అతిపెద్ద అపరాధంగా భావించారు. హిందూ మతాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడటంలో ముఖ్యమంత్రి జగన్ రాజధర్మాన్ని విస్మరించారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బిట్రగుంట నుంచి అంతర్వేది వరకూ రథాల దగ్ధం.. పత్తికొండ నుంచి పిఠాపురం వరూ ఆలయాలపై దాడులు.. రాజమహేంద్రవరర నుంచి రామతీర్థం వరకూ విగ్రహాల విధ్వంసం.. తిరుమల, శ్రీశైలం, సింహాచలంలో అన్యమతస్తుల ఆగడాలు.. ఎక్కడికక్కడ హిందూ మతధ్వేషులు అరాచకాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవడం దేశానికి మంచిది కాదన్న నిర్ణయానికి పీఠాధిపతులు వచ్చారు.
ఇవన్నీ ముందుగానే పసిగట్టిన జగన్ ప్రభుత్వ పెద్దలు విశాఖలోని రాజగురువు శారదాపీఠాధిపతి వద్దకు వెళ్లారు. ఆయన సూచన మేరకు పీఠాధిపతుల పాదాలపై పడేందుకు రాష్ట్రంలోని అమాత్యులు, శాసన సభ్యులను రంగంలోకి దించారు. దేవదాయ మంత్రి వెలంపల్లి, వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. శృంగేరి ఉత్తర పీఠాధిపతి భారతీతీర్థ స్వామి, మైసూరులోని గణపతి సచ్చిదానందస్వామి, కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, కుర్తాళం సిద్ధేశ్వరి పీఠాధిపతి, సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామిల వద్దకు వెళ్లి.. ఆలయాల ఘటనల్లో బాధ్యులపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందని తెలిపారు.
స్వామీజీల సమావేశం రద్దు చేసుకునేలా చూడాలని వారిని కోరారు. గంట గంటకు మత మార్పిళ్లు జరుగుతాయని చెప్పిన మత ప్రచారకుడిపై ఏం చర్యలు తీసుకున్నారని ఒక మఠాధిపతి అడిగితే మంత్రి నీళ్లు నమిలినట్లు తెలిసింది. దేవాలయాలపై దాడులకు బాధ్యత వహించి మీరెందుకు రాజీనామా చేయలేదని ఇంకో ఇద్దరు పీఠాధిపతులు వెలంపల్లిని నిలదీసినట్లు సమాచారం. ఆంధ్రలో ఏం జరుగుతోందో తమకు తెలుసని ఇంకొందరు సాధుసంతులు తేల్చిచెప్పడంతో రాయబార యత్నాలు విఫలమయ్యాయి.
దీంతో త్రిదండి చినజియర్ స్వామిని రంగంలోకి దించారు. ఆయన కొన్ని జిల్లాల్లో తిరిగి మతసామరస్యం గురించి హిందువులకు హితబోధ చేశారు. అంటే బలవంతపు మతమార్పిడులు జరిగినా.. దేవాలయాలు, దేవతావిగ్రహాలపై అపచారాలు చేస్తున్నా.. నోరుమూసుకుని కూర్చోవాలా అని కడపలో కొందరు భక్తులు నిలదీసేటప్పటికి ఆయన బిత్తరపోయారు. చివరకు ధర్మాచార్యులు తిరుపతి సమీపంలో నిర్వహించిన సమావేశానికి మద్దతివ్వక తప్పలేదు.
రాజకీయ లబ్ధికోసమే విగ్రహాల ధ్వంసమట!
ఆలయాలపై దాడులు జరుగుతుంటే అపరాధులను పట్టుకోవడానికి పోలీసులు ఏ మాత్రం ప్రయత్నించడం లేదు. దాడుల ప్రేరేపితులను ప్రభుత్వం రక్షిస్తుండడమే దీనికి కారణమని, సీఎం స్వయంగా మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని విపక్షాలు విమర్శిస్తుంటే.. ఆయన వారిపై ఎదురుదాడికి దిగారు. రాజకీయ ప్రయోజనాల కోసమే దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని, మతాల మధ్య చిచ్చు పెడితే ఎవరికి లాభమని ప్రశ్నించారు.
‘ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎవరిని టార్గెట్ చేసి ఇలాంటి కుట్రలు చేస్తున్నారు? సంక్షేమ పథకాలు ప్రారంభించే సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాటికి పబ్లిసిటీ రాకుండా ప్రతిసారీ అసత్య ప్రచారం చేస్తున్నారు. దేవదాయ శాఖ పరిధిలో లేని.. మారుమూల, జనసంచారం లేని ఆలయాల్లో అర్ధరాత్రి ఇలాంటి పనులు చేస్తూ పోలీసు శాఖకు అప్రతిష్ఠ తెస్తున్నారు. విగ్రహాలు ఈ రోజు ధ్వంసం చేసి మరుసటి వాళ్లే రచ్చ చేస్తున్నారు. ఇదంతా పొలిటికల్ గెరిల్లా వార్ అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.