ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రేపు జరగనున్న రెండోవిడత పంచాయతీ ఎన్నికలపై పార్టీలు, అభ్యర్థులు దృష్టి సారించారు. రెండో విడతలో తమ అభ్యర్థుల గెలుపు కోసం ఆయా పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా మరికొన్నింటిలో పోటీ జరగనుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలరే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. రెండోదశలో ఎన్నికలు నిర్వహించనున్న 3,328 పంచాయతీల్లో 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. 33,570 వార్డుల్లో 12,604 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని వెల్లడించారు. రెండో దశ ఎన్నికలకు 29,304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
వాటిలో 5,480 సమస్యాత్మకం కాగా 4,181 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలని ద్వివేది తెలిపారు. రెండో దశ ఎన్నికల కోసం 47,492 మంది సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు, ఫలితాలు ఉంటాయని చెప్పారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆయా కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లు, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచామన్నారు. కోవిడ్ వ్యాధిగ్రస్తులుంటే పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు.