జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమైనట్లే అనిపిస్తోంది. తాజాగా జనసేన, కాంగ్రెస్ పార్టీలు హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయి. మూడు రాజధానుల ప్రతిపాదనపై హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రాజధాని అమరావతి ప్రాంత రైతులు జేఏసిగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జేఏసి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ విచారణలో భాగంగానే రాజకీయ పార్టీలు కూడా తమ వాదన వినిపించవచ్చని హైకోర్టు అవకాశం ఇచ్చింది.
గతంలోనే తెలుగుదేశంపార్టీ తన అభిప్రాయాన్ని, వాదనను అఫిడవిట్ రూపంలో వినిపించింది. తాజాగా జనసేన, కాంగ్రెస్ కూడా అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఇక అఫిడవిట్లు వేయాల్సింది బిజెపి+వామపక్షాలు మాత్రమే. బహుశా వామపక్షాలు కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అఫిడవిట్లు దాఖలు చేసే అవకాశాలే ఎక్కువ. కాకపోతే బిజెపి వైఖరే ఏమిటన్నది ఇంకా సస్పెన్సుగా మిగిలిపోయింది. మిత్రపక్షాలుగా ఉన్న నేపధ్యంలో జనసేన తన అఫిడవిట్ దాఖలు చేసేముందు బిజెపితో చర్చించిందా లేదా అన్న విషయం తెలీలేదు.
ఎందుకంటే రాజధాని ఏర్పాటు విషయం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ ఇష్టమే అని కేంద్రప్రభుత్వం ఇఫ్పటికే చాలాసార్లు తేల్చి చెప్పేసింది. కేంద్రం ఇచ్చిన అఫిడవిట్లు జగన్ ప్రతిపాదనకు పరోక్షంగా మద్దతు తెలిపేట్లుగానే ఉన్నాయి. ఈ నేపధ్యంలో మరి రాష్ట్ర బిజెపి ఏమి చేస్తుందన్నదే ఆసక్తిగా మారింది. అసలు అఫిడవిట్ ఇస్తుందా ? ఇవ్వదా ? అన్నది కూడా తెలియటం లేదు. టిడిపి+జనసేన+కాంగ్రెస్ ఏమో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మూడు అమరావతిలోనే ఉండాలని పట్టుబడుతున్నాయి. అయితే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని తొలినుండి బిజెపి డిమాండ్ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ కూడా ఇచ్చింది.
అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ విషయంలో జగన్ ప్రతిపాదనకు బిజెపి మద్దతుగా నిలబడింది. కాబట్టే మిగిలిన రెండు విషయాల్లో బిజెపి నేతలు తమ వైఖరిని బహిరంగం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకనే కేంద్రప్రభుత్వం వేరు రాష్ట్రంలో బిజెపి పార్టీ వేరంటూ వాదిస్తున్నారు. సరే బిజెపిని వదిలిపెట్టేసినా మిగిలిన ప్రతిపక్షాలన్నీ జగన్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఏకమైనట్లే అర్ధమవుతోంది. మరి కోర్టు విచారణలో ఏమి తేలుతుందో చూడాలి.