ప్రాంతాలు వేరయినా తెలుగు జాతి ఒక్కటే అని చాలా రోజులకు నిరూపణ కావడం ఓ మంచి పరిణామం. రాజకీయంగా ఏ ప్రయోజనం ఆశించి ఉన్నారో అన్నది అటుంచితే నిన్నటి వేళ అన్ని పార్టీలు (దాదాపు) ఆయన్ను కీర్తించాయి. బండి సంజయ్ తో సహా చాలా పార్టీల నాయకులు తెలుగు జాతి వైభవం చాటిన వైనాన్ని గుర్తు తెచ్చుకోవడం నిజంగానే రెండు ప్రాంతాలకూ ఓ గొప్ప సందర్భమే ! శత జయంతి వేళ అందరు నాయకులు ఒకే వేదికపైకి వచ్చి (ప్రాంతాలకు అతీతంగా) ఓ కార్యక్రమం నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది అన్న ప్రతిపాదన కూడా ఉంది.
రామారావు తమకు రాజకీయ జీవితం ఇచ్చారన్న కృతజ్ఞత ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల్లో ఉందని, అందుకే వారంతా కదలి వచ్చారని చింతమనేని ప్రభాకర్ (మాజీ విప్) స్పందించారు. ఇకా ఆయన నుంచి రాజకీయ భిక్ష పొందిన నామా నాగేశ్వరరావు కానీ, తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇప్పటికీ ఎప్పటికీ కృతజ్ఞత చూపాల్సిన వారే! అంతేకాదు రామారావు పేరిట ఏదయినా ఓ మంచి కార్యక్రమం చేపట్టి వారికి నివాళులివ్వాలి.
తెలుగుదేశం పార్టీ తనకు రాజకీయం జీవితం ఇచ్చిందని నిన్నటి వేళ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పదే పదే చెప్పారు. ఆయన త్వరలోనే ఫ్లై ఓవర్ పనులు తన నియోజకవర్గంలో పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పుతానని అన్నారు. గత ఎన్నికల్లో రెండవసారి రాజకీయ పునర్జన్మ ఇచ్చింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. ఎన్టీఆర్ నివాళులిస్తూ..ఆయన ఈ విధంగా స్పందించారు.
ఇప్పటిదాకా ఓ లెక్క అటుపై ఓ లెక్క అని అంటుంటారే అది నిజం! ఆ విధంగా తెలుగుదేశం పార్టీ మహానాడు ముగిసింది. ఓ విధంగా ఇది మూడురోజుల పండుగ. ఎందుకంటే మహానాడుకు ముందు ఒక రోజు పొలిట్ బ్యూర్ కూడా జరిగింది. ఏ విధంగా చూసుకున్నా టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది.
అదే గులాబీ దండు వెళ్లి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆ మహనీయుడికి నివాళులివ్వడం.. ఇదే సందర్భంలో అక్కడికి వెళ్లిన నామా నాగేశ్వరరావు కానీ మల్లారెడ్డి కానీ మోత్కుపల్లి కానీ అంతా టీడీపీ మనుషులే ! ఇంకా చెప్పాలంటే ఇవాళ టీడీపీకి చెందిన వారంతా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. టీఆర్ఎస్ అధినేత కూడా ఒకనాటి ఎన్టీఆర్ అభిమానే ! కనుక రామారావు అందరి బంధువు!