2,000,000,000,000,000,000.. ఏంది అంకెలు. చదవటానికే మహా ఇబ్బందిగా ఉందని అనుకుంటున్నారా? నిజమే.. ఒక్కసారిగా చదవటం కష్టం. ఒకటికి రెండుసార్లు లెక్కలు వేసుకున్న తర్వాత కూడా పలకాలంటే కాస్త కష్టపడాల్సింది. ఎందుకంటే.. రెండు అంకె తర్వాత పద్దెనిమిది సున్నాలున్న ఈ సంఖ్యను.. రెండు కోట్ల కోట్లుగా చెప్పాలి. ఇంతకూ ఈ భారీ అంకెకు.. కరోనా మహమ్మారికి లింకేమిటంటారా? మొత్తం విషయం తెలిస్తే అవాక్కు కావటమే కాదు.. దాన్ని జీర్ణించుకోవటం కాస్త కష్టమని చెప్పాలి.
మానవ నాగరికత మొదలైన తర్వాత.. ఒకే సమయంలో యావత్ ప్రపంచం ఒకే అంశం మీదా విపరీతంగా ప్రభావితం కావటం.. స్తంభించిపోయినట్లుగా ఉండటం చాలా చాలా అరుదుగా చెప్పాలి. అలాంటి అరుదైన సీన్ ను.. తీసుకొచ్చింది కరోనా మహమ్మారి. కంటికి కనిపించని ఈ బుల్లి వైరస్ కు సంబంధించిన తాజాగా బాత్ వర్సిటీకి చెందిన గణిత శాస్త్రవేత్త ఒకరు ఆసక్తికరమైన లెక్క ఒకటి వేశారు.
నిజానికి ఆయనకో సందేహం వచ్చింది. అదేమంటే.. కంటికి కనిపించనంత బుల్లిగా ఉండే కరోనా వైరస్ బంతి ఆకారంలో ఉంటుందన్నది తెలిసిందే. మరి.. ప్రపంచంలోని కరోనా వైరస్ మొత్తాన్ని ఒకచోటుకు చేర్చి కుప్పలా పోస్తే ఎంత భారీగా ఉంటుందన్న సందేహంతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ లెక్కలో చెప్పాలంటే ఎంతఅన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశాన్ని సవాలుగా తీసుకున్న కిట్ యేల్స్ అనే గణిత శాస్త్రవేత్త తాజాగా తేల్చారు. ఆయన లెక్క ప్రకారం.. కరోనా వైరస్ ను ఒక చోటుకు చేరిస్తే.. వాటన్నింటిని 330 మిలీ ఉన్న కోక్ టిన్ లో సరిపోతుందంటున్నారు.
వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజమంటున్నారు. అంతేకాదు.. ప్రపంచం మొత్తంగా ఉన్న కరోనా వైరస్ ను కోక్ టిన్ లో ఉంచిన తర్వాత కూడా కొంత ఖాళీ ఉంటుందని చెబుతున్నారు. ఈ ఒక్క లెక్క చాలు.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన కరోనా ఎంత బుల్లిదో ఇట్టే అర్థం కాక మానదు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా సూక్ష్మజీవి లెక్క ఎంత ఉంటుందన్న విషయం మీదా పరిశోధన చేసిన ఆయన.. ప్రపంచంలో ఏ క్షణంలో అయినా దాదాపు 2,000,000,000,000,000,000 వైరస్ లు ఉనికిలో ఉంటాయని తేల్చారు. కరోనా లెక్కలు ఒక పట్టాన మింగుడు పడటం లేదు కదా? కరోనా? మజాకానా?