ఈ మధ్య కాలంలో కొన్ని యాడ్ లు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. యాడ్స్ కోసం ఎంచుకునే కాన్సెప్ట్ మతపరమైన అంశాలతో ముడిపడి ఉండడం, అందులో ఓ వర్గం వారి మనోభావాలు దెబ్బతిన్నాయని విమర్శలు రావడం చూస్తూనే ఉన్నాం. గతంలో ప్రముఖ నగల కంపెనీ ‘తనిష్క్‘ రూపొందించిన యాడ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవలోనే మరో ప్రముఖ నగలు, వస్త్రాల కంపెనీ రూపొందించిన యాడ్ వివాదాస్పదమైంది.
ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఆ సంస్థ రూపొందించిన యాడ్ పై తాజాగా దుమారం రేగుతోంది. పెళ్లి సందర్భంగా రూపొందించిన ఆ యాడ్ లో పెళ్లికూతుర్ని కన్యా ‘దానం‘ చేయటం ఏంటంటూ ఆలియా ప్రశించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారంపై చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్యాదానం గురించి ఓ యాడ్ ఏజెన్సీ వచ్చి హిందువులకి నీతులు చెప్పటం హాస్యాస్పదమని రంగరాజన్ అన్నారు.
వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతి, నాగరికత కొనసాగుతున్నాయని, పెళ్లికూతురుని మహాలక్ష్మీ స్వరూపంగా భావించే సంప్రదాయం మన దేశంలో ఉందని, ఆ యాడ్‌ను తక్షణం వెనక్కి తీసుకోవాలని రంగరాజన్ డిమాండ్ చేశారు. గతంలో తనిష్క్ రూపొందించిన యాడ్ లో హిందూ-ముస్లిమ్ మతాంతర వివాహం పాయింట్ పై దుమారం రేగింది. దీంతో, ఆ సంస్థ ఆ యాడ్ ను వెనక్కి తీసుకుంది. మరి, తాజాగా ఈ యాడ్ ను కూడా సదరు సంస్థ వెనక్కు తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.