‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా నటించిన ఆలియా భట్ ఈ చిత్రం సక్సెస్ పై వెంటనే స్పందించకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజమౌళిని తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఆలియా భట్ అన్ ఫాలో చేసిందని, అంతేకాదు, ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన పోస్ట్ లు డిలీట్ చేసిందని టాక్ వచ్చింది. సినిమాలో తన పాత్ర నిడివి, సీన్స్ చాలా తక్కువగా ఉండడంతోనే జక్కన్నపై ఆలియా అలిగి ఈ నిర్ణయం తీసుకుందని సోషల్ మీడియా కోడై కూసింది.
తనకు స్క్రీన్ స్పేస్ తగ్గిందన్న కారణంతోనే సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్న ఆలియా…సినిమా విడుదలైన తర్వాత మాత్రం గప్ చుప్ గా ఉండిపోయిందని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం మొదలైన తర్వాత రియాక్ట్ అయిన ఆలియా…బాలీవుడ్ లో రూ.100 కోట్ల క్లబ్ లో ఆర్ఆర్ఆర్ చేరిందని మాత్రం ట్వీట్ చేసింది. అయినా సరే ఆలియా అలిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం తగ్గలేదు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ పుకార్లపై ఆలియా తొలిసారి డైరెక్ట్ గా స్పందించింది. తనకు ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ఎలాంటి అసంతృప్తి లేదని చెబుతోన్న బాలీవుడ్ బ్యూటీ…దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది. తన ఇన్‌స్టా స్టోరీలో ఆ వ్యవహారంపై ఆలియా ఓ లేఖను పోస్ట్ చేసింది. ఆర్ఆర్ఆర్ పాత పోస్టులను తాను డిలీట్ చేశానని పుకార్లు వచ్చాయని, కానీ, తాను ప్రతిసారి
తన ఇన్‌స్టాలోని పాత పోస్టులను తన ప్రొఫెల్ గ్రిడ్ నుంచి తిరిగి మారుస్తుంటానని చెప్పుకొచ్చింది.
అందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ పోస్టులను కూడా మార్చానని, ఇలా యాదృచ్ఛితంగా జరిగిన ఘటనల ఆధారంగా తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. ’ఆర్ఆర్ఆర్‘ వంటి గొప్ప చిత్రంలో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని,
సీత పాత్రని చాలా ప్రేమతో చేశానని అంటూ సంతోషం వ్యక్తం చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో కలిసి నటించడం అదృష్టం అని, ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ప్రతి విషయంలోనూ తాను చాలా సంతోషంగా ఉన్నానంటూ ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చింది.
రాజమౌళితో పాటు ఆయన టీమ్ అంతా ఈ సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డారని, వారి శక్తినంతా ధారబోసి ఓ మంచి చిత్రాన్ని అందించారని, ఇలాంటి గొప్ప చిత్రం పట్ల ఇలా తప్పుడు విషయాలను ప్రచారం చేయడాన్ని తాను ఖండిస్తూనే ఈ వివరణనిస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉందిగానీ…ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ గురించి, 100 కోట్ల క్లబ్ లో చేరడం గురించి ఇంత లేటుగా ఎందుకు స్పందించిందోనని నెటిజన్లు మాత్రం చురకలంటిస్తూనే ఉన్నారు.