టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన అలీ వైసీపీ నేతగానూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి హీరో పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న అలీ…2019 ఎన్నికలకు ముందు జనసేనలో చేరతారని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజకీయాలు వేరు… సినిమాలు… స్నేహం వేరు అని అలీ చెప్పారు.
కానీ, ఇప్పటికీ పవన్ తనకు మంచి స్నేహితుడు అని చెబుతూ ఉంటారు అలీ. అయితే, వైసీపీపై కారాలు మిరియాలు నూరుతున్న పవన్ కు…వైసీపీ నేతగా ఉంటున్న అలీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిందని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీని జగన్ నియమించడంతో ఆ గ్యాప్ మరింత పెరిగిందని పుకార్లు వచ్చాయి. ఇక, అలీ కూతురి పెళ్లికి పవన్ హాజరు కాకపోవడంతో ఆ పుకార్లు నిజమనేలా కామెంట్లు కూడా వచ్చాయి.
అయితే, పవన్ షూటింగులో ఉండి రాలేకపోయారని, తన ఇంటికి వచ్చి వధూవరులను కలుస్తానని మాటిచ్చారని అలీ అన్నారు. ఈ నేపథ్యంలోనే అలీ హోస్ట్ గా ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమం ముగింపు ఎపిసోడ్ లో పవన్ తో గ్యాప్ పై అలీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ చివరి ఎపిసోడ్ కు ప్రముఖ యాంకర్ సుమ హోస్ట్ గా రాగా…అలీ గెస్ట్ గా వచ్చారు. దీంతో, అలీని ఇంటర్వ్యూ చేస్తున్న సుమ ప్రోమో విడుదలైంది.
పవన్ కల్యాణ్ తో గ్యాప్ ఎందుకు వచ్చిందంటూ అలీని సుమ ప్రశ్నించినట్లుగా ఆ వీడియోలో ఉంది. పవన్ తో గ్యాప్ రాలేదని, గ్యాప్ క్రియేట్ చేశారని అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం జరిగిందంటే.. అంటూ అలీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా ప్రొమో కట్ చేశారు. అంటే, ఆ గ్యాప్ ఎవరు క్రియేట్ చేశారు..అలీ ఏం చెప్పారన్నది ఈ నెల 19న ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ లో చూడొచ్చు.