నందమూరి అభిమానులు చాలా ఫ్రస్టేషన్లో ఉన్నారిప్పుడు. టాలీవుడ్లో పేరున్న చిత్రాలు చాలా వాటికి రిలీజ్ డేట్లు ప్రకటించారు కానీ.. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ‘అఖండ’ గురించే చప్పుడు లేదు.
వచ్చే వేసవిలో వచ్చే సినిమాలకు కూడా డేట్లు ఇస్తున్నపుడు షూటింగ్ చివరి దశలో ఉండి, విడుదలకు సిద్ధమవుతున్న చిత్రానికి డేట్ ప్రకటించకపోవడం ఏంటన్నది నందమూరి అభిమానుల అభ్యంతరం.
దసరా రిలీజ్ అన్నారు. కానీ దాని ఊసే లేదు. ఆ పండుగ రేసు నుంచి ‘అఖండ’ తప్పుకున్నట్లే. మరి తర్వాతి డేట్ ఏంటన్నదానిపై స్పష్టత లేదు. ఈ సినిమా చివరి షెడ్యూల్ కోసం ‘అఖండ’ టీం గోవాకు వెళ్లింది.
అక్కడ కూడా పని పూర్తయినట్లు చెబుతున్నారు. షూటింగ్ అంతా అయిపోయినట్లే అంటున్నారు. మరి ఇప్పుడైనా డేట్ ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
ఐతే షూట్ అంతా అయ్యాకే రిలీజ్ డేట్ ప్రకటించాలని, అలాగే ఏపీలో టికెట్ల గొడవ సంగతేంటో తేలాకే విడుదల తేదీపై నిర్ణయం తీసుకోవాలని ‘అఖండ’ టీం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘అఖండ’ టీం దృష్టి దీపావళిపై పడిందట. ఆ పండక్కి పెద్దగా పోటీ లేకపోవడం, పేరున్న సినిమా ఏదీ ఖరారవకపోవడంతో తమ చిత్రాన్ని విడుదల చేయడానికి అదే సరైన టైం అని భావిస్తున్నారట.
ఏపీలో టికెట్ల ధరల విషయమై ఇంకొన్ని రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న నేపథ్యంలో అది జరగ్గానే ‘అఖండ’ రిలీజ్ డేట్ ప్రకటిస్తారట. ప్రస్తుతానికి దీపావళికి రెండు సినిమాలు ఖరారయ్యాయి.
రజినీకాంత్ డబ్బింగ్ సినిమా ‘అన్నాత్తె’తో పాటు మారుతి కామెడీ ఎంటర్టైనర్ ‘మంచి రోజులు వచ్చాయి’ కూడా దీపావళికి రాబోతున్నాయి. మరి ‘అఖండ’ కూడా పండుగ రేసులోకి వస్తే బాక్సాఫీస్ వేడెక్కడం ఖాయం.