ఓవైపు ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’.. ఇంకోవైపు ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’.. మరోవైపేమో ‘రూలర్’.. ఇలా మూడు భారీ డిజాస్టర్లతో నందమూరి బాలకృష్ణ పాతాళానికి పడిపోయాడు ఒక్కసారిగా. ఆయన ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తినేశాయి ఆ మూడు చిత్రాలతో. ఇక బాలయ్య పనైపోయిందంటూ చాలామంది తీర్మానాలు చేసేశారు.
ఇక నందమూరి హీరో పుంజుకోవడానికి ఆస్కారమే లేదనేశారు. కానీ కొంచెం జాగ్రత్తగా సినిమాలు ఎంచుకోవడం ద్వారా బాలయ్య మళ్లీ గట్టిగానే పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ‘రూలర్’ తర్వాత బాలయ్య కొత్త సినిమా ఏదీ ఇంకా విడుదల కాలేదు కానీ.. బాలయ్య లైనప్ మాత్రం భలే క్రేజీగా ఉంది. ఈ నందమూరి హీరో మళ్లీ అభిమానులను ఒకప్పటి స్థాయిలో అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ రూటే సపరేటు. మాస్లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకుని ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి దీటుగా ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్బస్టర్లు ఇచ్చిన బాలయ్య.. మధ్యలో జోరు తగ్గించేశాడు. ఇండస్ట్రీ హిట్ ‘నరసింహ నాయుడు’ తర్వాత బాలయ్య దాదాపు దశాబ్దం పాటు ఎంత డౌన్ అయిపోయాడో తెలిసిందే. బాలయ్యపై ఒకానొక టైంలో బోలెడన్ని జోకులు పేలేవన్న సంగతీ తెలిసిందే.
అలాంటి సమయంలోనే బోయపాటి శ్రీను నందమూరి హీరోను నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో ప్రెజెంట్ చేసి ‘సింహా’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందించాడు. అది నందమూరి అభిమానులకు గొప్ప ఉపశమనం. కానీ తర్వాత బాలయ్య అడుగులు మళ్లీ తడబడ్డాయి. కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. ఆపై మళ్లీ బోయపాటితో చేసిన ‘లెజెండ్’ బ్లాక్‌బస్టర్ అయి బాలయ్య కెరీర్‌ను గాడిన పెట్టింది.
ఐతే మళ్లీ ఆయన అడుగులు తడబడ్డాయి. ఆశించిన విజయాలు దక్కలేదు. యన్.టి.ఆర్, రూలర్ సినిమాలతో బాలయ్య కెరీరే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఈ టైంలో మళ్లీ బాలయ్యను రక్షించడానికి బోయపాటే వచ్చాడు. వీరి కలయికలో వస్తున్న మూడో చిత్రం ‘అఖండ’కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది.
బాలయ్య ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే ఎప్పట్లాగే బోయపాటి చిత్రం తర్వాత బాలయ్య మళ్లీ తప్పులు చేస్తాడేమో అని అభిమానులు భయపడుతున్నారు. కానీ ఆయన ఈసారి తెలివిగానే అడుగులు వేస్తున్నాడు.
క్రేజీ.. క్రేజీ..
‘అఖండ’ సినిమా మొదలైనపుడు పెద్దగా క్రేజ్ లేదు కానీ.. గత ఏడాది దీని టీజర్ రిలీజైనపుడు అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక్కసారిగా క్రేజీ బిజినెస్ ఆఫర్లు వచ్చాయి ఈ చిత్రానికి. ఇక ఈ మధ్యే రిలీజ్ చేసిన ‘టైటిల్ రోర్’ టీజర్‌తో సినిమా మరింతగా జనాల్లోకి వెళ్లింది.
ఈ టీజర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వచ్చాయి. సినిమా క్రేజ్ మరో స్థాయికి చేరిపోయింది. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ అనిపిస్తోంది. మే 28నే రావాల్సిన ‘అఖండ’ కరోనా కారణంగా వాయిదా పడిరది. ఆగస్టు-సెప్టెంబరు మధ్య సినిమా విడుదలయ్యే అవకాశముంది.
ఇక ‘అఖండ’ సెట్స్ మీద ఉండగానే.. బాలయ్య మరో క్రేజీ ప్రాజెక్టుకు సంతకం చేశాడు. ‘క్రాక్’తో ఈ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా ఓకే చేశాడు. మంచి ఊపుమీదున్న మాస్ డైరెక్టర్‌తో బాలయ్య సినిమా చేయబోతుండటం అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది.
‘క్రాక్’ లాగే వాస్తవ ఘటనల ఆధారంగా ఒక పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేశాడట బాలయ్య కోసం గోపీచంద్. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండటం మరో ప్లస్ పాయింట్. ప్రస్తుతం తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ‘అఖండ’కు సంగీతం అందిస్తున్న తమన్ దీనికీ పని చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. బాలయ్య తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును కన్ఫమ్ చేశాడు. ఎప్పట్నుంచో తనతో సినిమా చేయాలని చూస్తున్న తన అభిమాని, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఇటు అనిల్, అటు బాలయ్య ఇద్దరూ కూడా తమ కలయికలో సినిమా రాబోతోందని ధ్రువీకరించారు.
దర్శకుడిగా అపజయమే ఎరుగని, యూత్‌కు నచ్చే మంచి ఎంటర్టైనర్లు అందిస్తాడని పేరున్న అనిల్‌తో బాలయ్య సినిమా చేయబోతుండటం నందమూరి అభిమానులకు ఉత్సాహాన్నిస్తోంది. మాస్ టచ్ ఉంటూనే మరీ మూసగా లేకుండా చూసే దర్శకులతో బాలయ్య సినిమాలు లైన్లో పెట్టడంతో ఆయన కెరీర్ మరో స్థాయికి వెళ్తుందనే ఆశతో ఉన్నారు అభిమానులు.
అదొక్కటే భయం
బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి.. ఇక్కడి వరకు బాలయ్య లైనప్ అదిరిపోయింది. కానీ ఆ తర్వాత ఆయన ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేస్తానంటుండటమే అభిమానులను కొంత కలవరపాటుకు గురి చేస్తోంది. అలాంటి క్లాసిక్‌కు సీక్వెల్ తీయడం మంచి విషయమే. కానీ దాన్ని డీల్ చేసే దర్శకుడు ఎవరున్నారన్నది ప్రశ్న.
ఒరిజినల్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు స్క్రిప్టు అయితే రెడీ చేశారు కానీ.. ఈ వయసులో ఆయన ఈ భారీ చిత్రాన్ని సమర్థంగా తెరకెక్కించే స్థితిలో లేరు. పౌరాణికంతో పాటు సైంటిఫిక్ టచ్ ఉన్న సినిమాను సరిగ్గా డీల్ చేసే దర్శకులు కనిపించడం లేదు. దీంతో బాలయ్యే స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలనుకుంటుండటం గమనార్హం. పైగా ఈ చిత్రంతోనే తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తానంటున్నాడు.
మోక్షజ్ఞ చూస్తే సినిమా చేసే లుక్స్‌లో కనిపించడం లేదు. అతడికి సినిమాలపై ఆసక్తి ఉందా అన్న సందేహాలూ కలుగుతున్నాయి. ‘ఆదిత్య 369 సీక్వెల్‌కు నేనే దర్శకత్వం వహిస్తా, మోక్షజ్ఞును పరిచయం చేస్తా’ అన్న బాలయ్య స్టేట్మెంట్ అభిమానులకే అంతగా రుచించడం లేదు. ఇది బాలయ్యతో పాటు మోక్షజ్ఞ కెరీర్‌కూ ప్రతికూలంగా మారుతుందేమో అని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో బాలయ్య కొంచెం పునరాలోచిస్తే మంచిదేమో.