ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు, తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. 2012లో మతకలహాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ కేసు నమోదైంది. ఆ వ్యాఖ్యలకు గాను సుమోటోగా అక్బరుద్దీన్ పై 2 కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి దేశద్రోహం కేసు. ఆ రెండు కేసుల్లో అక్బరుద్దీన్ గతంలో సుమారు 40 రోజులు జైల్లో గడిపారు. ఆ తర్వాత 2013లో ఈ కేసులో అక్బరుద్దీన్ బెయిల్ పై బయటకు వచ్చారు.
ఈ క్రమంలోనే పదేళ్ల తర్వాత ఆ కేసు విచారణ పూర్తయి…తుది తీర్పు నేడు వెలువడింది. అక్బరుద్దీన్ పై నమోదైన కేసులను కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు.. ఈ కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు సందర్భంగా కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ కు న్యాయమూర్తి పలు కీలక సూచనలు చేశారు. భవిష్యత్తులో ఆ తరహా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేశారు.
ఆ తరహా ప్రసంగాలు దేశ సమగ్రతకు మంచిది కాదని చెప్పారు. ఈ తీర్పును తన విజయంగా పరిగణించరాదని, ఎలాంటి సంబరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పాతబస్తీ సహా నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. చార్మినార్, చాంద్రాయణగుట్ట, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. అయితే, ఈ తీర్పుపై బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.