తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతుందన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ తో ఒవైసీ సోదరుల దోస్తీ గురించి విపక్షాలు కూడా పలుమార్లు విమర్శలు గుప్పిస్తుంటాయి. దానికి తగ్గట్లుగానే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ టీఆర్ఎస్ కు ఎంఐఎం చేయందించింది. అయితే, సందర్భానుసారంగా టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించడానికి కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ వెనుకాడరు.
గతంలో కూడా చాలాసార్లు అధికార పార్టీపై అసెంబ్లీ వేదికగా పలుమార్లు అక్బరుద్దీన్ విమర్శలు గుప్పించారు. అడ్డదిడ్డంగా కాకుండా…విశ్లేషణాత్మకంగా, లాజికల్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో అక్బరుద్దీన్ ముందుంటారు. అయితే, అక్బరుద్దీన్ విమర్శలపై టీఆర్ఎస్ నేతలెవ్వరూ నోరు మెదిపిన దాఖలాలు లేవు. తాము సద్విమర్శలనే చేస్తామని, ప్రభుత్వానికి తాము మిత్ర పక్షమేనని అక్బరుద్దీన్ అభిప్రాయపడుతుంటారు. ఈ క్రమంలోనే తాజా అసెంబ్లీ సమావేశాలలోనూ కేసీఆర్ సర్కార్ పై అక్బరుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు.
గత మూడేళ్ల నుంచి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం చెబుతున్నంత పనితీరు ఆరోగ్యశాఖలో లేదని ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. టిమ్స్ హాస్పిటల్ ను అట్టహాసంగా ప్రారంభించి…హఠాత్తుగా ఎందుకు మూసివేశారో తెలీదంటూ ప్రభుత్వానికి ఒవైసీ చురకలంటించారు. మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని అక్బరుద్దీన్ షాకింగ్ ఆరోపణలు చేశారు.
అయితే, కేసీఆర్ సర్కార్ అభినందనలతోపాటు విమర్శలను కూడా సానుకూలంగా తీసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం మంచి చేస్తోందని, కానీ ఇంకా చేయాల్సి ఉందని ఒవైసీ సూచించారు. ఇక, రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ అని, మరోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అక్బరుద్దీన్ జోస్యం చెప్పారు. అంతేకాదు, టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి తాము పనిచేస్తామని, బంగారు తెలంగాణ అభివృద్ధిలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ముందుకు వెళతాయని అన్నారు.