మహారాష్ట్ర రాజకీయాల్లో ఏరోజు ఏమి జరుగుతోందో ఎవరూ ఊహించలేపోతున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను మించిపోయింది మహారాష్ట్ర రాజకీయం. తాజాగా బాబాయ్, ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ కు అబ్బాయి, ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పెద్ద షాకే ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే నాగాల్యాండ్ ఎన్సీపీని అజిత్ సొంతం చేసేసుకున్నారు. నాగాల్యాండ్ లో ఎన్సీపీకి ఆరుగురు ఎంఎల్ఏలున్నారు. వీళ్ళంతా తాజాగా అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకే జై కొట్టారు.
నాగాల్యాండ్ వ్యవహారాన్ని శరద్ ఏమాత్రం ఊహించలేదట. మహారాష్ట్రలో మొదలైన వివాదాన్ని పరిష్కరించటంలోనే శరద్ బిజీగా ఉన్నారు. చెప్పాలంటే ఒకరకంగా శరద్ చేతులెత్తేసినట్లే కనబడుతోంది. ఎలాగంటే 53 మంది ఎన్సీపీ ఎంఎల్ఏల్లో 30 మంది అజిత్ వర్గంలోనే ఉన్నారు. ఈ వర్గమే ఈమధ్యనే ఏక్ నాథ్ షిండే-బీజేపీ కూటమిలో చేరిపోయిన విషయం తెలిసిందే. తాను ఉపముఖ్యమంత్రి అవ్వటమే కాకుండా తన వర్గంలోని మరో 8 మందికి మంత్రిపదవులు వచ్చేట్లు చేశారు. దాంతో సహజంగానే మెజారిటి ఎంఎల్ఏలు అజిత్ వైపే ఉన్నారు.
ఇపుడు ఏ పార్టీలో చూసినా సిద్ధాంతాలు కాకుండా రాద్దాంతాలే రాజ్యమేలుతున్నాయి. అదికారం లేనిదే ఏ ఎంఎల్ఏ, ఏ ఎంపీ కూడా ఉండటంలేదు. ఒకవేళ ప్రతిపక్షంలోనే ఉండాల్సొస్తే తన వ్యాపారాలకు, కాంట్రాక్టులకు, బిల్లులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. ఇలాంటి నేపధ్యంలోనే నాగాల్యాండ్ లో ఆరుగురు ఎంఎల్ఏలు అజిత్ వర్గంలో చేరిపోవటం శరద్ కు పెద్ద షాకనే చెప్పాలి.
పార్టీ గుర్తు, పార్టీ జెండా, ఖాతాలు అన్నీ తమకే చెందాలని ఇరువర్గాలు కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర ఫిర్యాదులు చేసున్నాయి. ఈ వివాదాన్ని కమీషన్ పరిశీలిస్తోంది. ఈలోగానే అజిత్ స్పీడుగా మిగిలిన వ్యవహారాలను చక్కబెట్టేసుకుంటున్నారు. రేపు సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసమే ముందుజాగ్రత్తగా పార్టీ కార్యవర్గాలను అజిత్ తనవైపుకు తిప్పుకుంటున్నట్లున్నారు. ఇందులో భాగంగానే నాగాల్యాండ్ ఎంఎల్ఏలు, పార్టీ కార్యవర్గాలను తనతో కలిపేసుకున్నారు. మరి షాక్ లో నుండి శరద్ ఎప్పుడు తేరుకుంటారు, సమస్య నుండి ఎలా బయటపడతారో చూడాల్సిందే.