అమెరికాలోని అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(ఏఐఏ), ఇండియన్ కాన్సులేట్ ఎస్ఎఫ్ఓ & బాలీ 92.3 ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దసరా & దీపావళి ధమాకా’విజయవంతమైంది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని నవంబరు 8, 2020న నిర్వంచిన ఈ వేడుకలకు పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ సారి భౌతిక దూరం, మాస్కులను ధరిస్తూ తక్కువ మందితో వేడుకలను నిర్వహించారు. ఫేస్ బుక్, జూమ్ మాధ్యమాల ద్వారా ఈ వేడుకలను లైవ్ టెలికాస్ట్ చేయడంతో వేలాదిమంది తిలకించారు. బే ఏరియాలోని 35 భారతీయ సంస్థలు ఈ కార్యక్రమాన్ని తిలకించాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీఏ సంజీవ్ గుప్తా గారు భారీగా స్పాన్సర్ చేశారు. వీరితోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీని గోలి, రియల్టర్ నాగరాజ్, పీఎన్ జీ జ్యూవెలర్లు కూడా స్పాన్సర్ చేశారు.
ఆహ్లాదంగా జరిగిన ఈ వేడుకలకు ఎందరో విశిష్ట అతిథులు, అధికారులు హాజరై దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ కాన్సుల్ జనరల్ అంబాసిడర్ డాక్టర్ టీ.వీ. నాగేంద్ర ప్రసాద్, ఆయన సతీమణి టీ.పద్మ, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు ఆర్ వో ఖన్నా, కాలిఫోర్నియా సెనేటర్ ఎలెక్ట్ డేవ్ కార్టీస్, కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ సభ్యుడు బిల్ క్విర్క్, కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ సభ్యురాలు ఆష్ కల్రా, శాంటా కౌంటీ సూపర్ వైజర్ -ఎలెక్ట్ ఒట్టో లీ, మిల్పిటాస్ సిటీ మేయర్ రిచ్ ట్రాన్, ఫ్రీమోంట్ సిటీ మేయర్ లిల్లీ మే, ఫ్రీమోంట్ సిటీ కౌన్సిల్ సభ్యుడు రాజ్ సల్వాన్, శాన్ రామోన్ సిటీ కౌన్సిల్ ఎలెక్ట్ సభ్యుడు శ్రీధర్ వెరోస్ లు ఈ కార్యక్రమానికి హాజరై దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహిచారు. బాలీవుడ్ పాటలకు పలువురు స్టెప్పులేసి ఆహూతులను అలరించారు.
ఈ వేడుకలలో ‘పికిల్ ఫెస్ట్’ హైలైట్ గా నిలిచింది. టీ.పద్మ గారి పర్యవేక్షణలో రకరకాల పచ్చళ్లు, చట్నీలు, పౌడర్ మేకింగ్ పోటీలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారతీయ సంప్రదాయ పచ్చళ్లు, పొడులను ప్రోత్సహించేందుక ఇండియన్ కాన్సులేట్ ఎస్ఎఫ్ వో ఆఫీస్, ఏఐఏలు సంయుక్తంగా ఈ పికిల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ పికిల్ ఫెస్ట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. పికిల్ ఫెస్ట్ లో పాల్గొన్నవారు విభిన్నమైన పచ్చళ్లను తయారు చేసి వాటి తయారీ విధానాన్ని వివరించారు. పికిల్ ఫెస్ట్ విజేతలను నిర్ణయించేందుకు జడ్జిలు ఒకటికి రెండు రౌండ్లు నిర్వహించాల్సి వచ్చింది.
ఇండియన్ కాన్సుల్ జనరల్ అంబాసిడర్ డాక్టర్ టీ.వీ. నాగేంద్ర ప్రసాద్, ఆయన సతీమణి టీ.పద్మల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావడం పట్ల ఏఐఏ టీం హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన రావడం, 35 భారతీయ కమ్యూనిటీ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఆనందాన్నిచ్చిందని ఏఐఏ తెలిపింది. వెస్ట్ కోస్ట్ లో జరిగిన అతిపెద్ద ఈవెంట్ ఇదని, దీనిని వేలాది మంది ఆన్ లైన్ లో వీక్షించడం కూడా మంచి అనుభూతినిచ్చిందని ఏఐఏ తెలిపింది. ఈ కార్యక్రమ విజయవంతం కావడానికి దోహదపడ్డ స్పాన్సర్లకు, కార్యక్రమం కోసం కష్టపడ్డ వాలంటీర్లకు ఏఐఏ ధన్యవాదాలు తెలిపింది.