కాంగ్రెస్ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కుడి భుజంగా అభివర్ణించే సీనియర్ నేత అహ్మద్ పటేల్.. ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న ఆయన.. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు కన్నుమూసినట్లుగా ఆయన కుమారుడు ఫైజల్ పటేల్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గుజరాత్ కు చెందిన ఈ సీనియర్ కాంగ్రెస్ నేత వయసు 71 ఏళ్లు. నెల క్రితం కరోనా బారిన పడిన ఆయనకు పలు అవయువాలు దెబ్బ తిన్నట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ పరిణామం కాంగ్రెస్ కు ఎంతో లోటు అని చెప్పాలి.
అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడమే కాకుండా… ప్రతిపక్ష హోదాకు సరిపడినన్ని సీట్లు కూడా విలవిల్లాడిపోతుంది. లోక్ సభలో 545 సీట్లు, రాజ్యసభలో 250 సీట్లు కలిపి మొత్తం 800 సీట్లకు గాను 100 సీట్లు కూడా కాంగ్రెస్ చేతిలో లేవంటో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ రాజకీయ ఇబ్బంది చాలదన్నట్లు మొన్న బీహార్ లో అతి చండాలంగా ఫర్ ఫాం చేసిన పార్టీ కాంగ్రెస్సే. ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు పార్టీ నడిపే అంత ఆరోగ్యం సోనియాకు లేదు. సామర్థ్యం రాహుల్ కు లేదు. ఇలాంటి సమయంలో అహ్మద్ పటేల్ వంటి సీనియర్ నేత మరణం ఆ పార్టీకి చాలాచాలా పెద్ద నష్టం. పెద్ద కష్టం.
సినిమా లాంటిదే రాజకీయం. తెర ముందుకు చాలామంది కనిపిస్తుంటారు. కానీ.. కీలక వ్యక్తి వెనుక నడిపిస్తారు. కాంగ్రెస్ అలాంటి వ్యక్తుల్లో ఒకరు అహ్మద్ పటేల్. కాంగ్రెస్ పార్టీ తీసుకునే కీలకమైన ప్రతి నిర్ణయం వెనుక ఆయన ఉంటారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టంగా చెప్పక తప్పదు.కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తల్లో ఆయన కీలకభూమిక పోషిస్తుంటారు. మిగిలిన నేతల మాదిరి తెర మీద కనిపించటానికి పెద్దగా ఇష్టపడరు. తెర వెనుక చురుగ్గా ఉంటారు.