వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సిట్ అధికారులను కలిసేందుకు వెళుతున్న షర్మిలను అడ్డుకున్న పోలీసులపై ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఎస్సైతోపాటు మహిళా కానిస్టేబుల్ ను షర్మిల నెట్టివేయడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ అధికారులను కలిసేందుకు షర్మిల బయలుదేరారు. అయితే, ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో వారితో షర్మిల వాగ్వాదానికి దిగారు.
దీంతో, విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసిన ఆరోపణల నేపథ్యంలో షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని, దాంతో ఆత్మ రక్షణ కోసం ప్రయత్నించానని షర్మిల వివరణ ఇచ్చారు. కానీ, షర్మిలతో దురుసుగా ప్రవర్తించలేదని, ఆమెను మహిళా కానిస్టేబుల్ పట్టుకొని అడ్డుకున్నారని పోలీసులు చెబుతున్నారు. తమతో షర్మిల దురుసుగా ప్రవర్తించారని, చేయి చేసుకున్నారని వారు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే షర్మిలకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు, షర్మిలను పరామర్శించేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన విజయమ్మ కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. స్టేషన్ లోకి వెళ్లకుండా విజయమ్మను అడ్డుకోవడంతో ఓ మహిళా పోలీస్ పై విజయమ్మ చేయిచేసుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.
అయితే, తాను పోలీసులను కొట్టానని మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవమని విజయమ్మ అసహనం వ్యక్తం చేశారు. తనపై పోలీసులు పడుతుంటే కోపం వచ్చిందని, వారిని తాను చేత్తో అలా అన్నానని చెబుతున్నారు. తాను నిజంగా కొట్టాలనుకుంటే గట్టిగా కొట్టేదాన్ని అని సమర్థించుకున్నారు.