అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే. అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు వెనుదిరిగిన కొద్ది రోజుల్లోనే ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం కాబూల్ లో పాగా వేసిన తాలిబన్లకు ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ..తలొగ్గారు. దీంతో, ఆ దేశపాలన తాలిబన్ల వశమైంది. ఈ క్రమంలోనే అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే ఘనీ తన వెంట భారీగా డబ్బు తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.
తాలిబన్ల దెబ్బకు ఘనీ తన దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో, ఘనీ తన కుటుంబంతో సహా కజకిస్థాన్ వెళ్లారని తొలుత ప్రచారం జరిగింది. కానీ, ఘనీ రాకను కజకిస్థాన్ వ్యతిరేకించడంతో ఆయన ఒమన్ వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, ఘనీ దేశం విడిచి నుంచి వెళ్లేముందు భారీ మొత్తంలో నగదు తన వెంట తీసుకువెళ్లారని ప్రచారం జరుగుతోంది. డబ్బుతో నిండిన 4 కార్లు, ఒక హెలికాప్టర్లో పట్టే మొత్తం నగదును ఘనీ తన వెంట తీసుకెళ్లారని తెలుస్తోంది.
అయితే, డబ్బుతో హెలికాప్టర్ నిండిపోవడంతో…ఘనీ ఆయన కుటుంబ సభ్యులకు స్థలం సరిపోలేదని, దీంతో, కొంత డబ్బును వదిలేసి వెళ్లారని తెలుస్తోంది. .’అష్రాఫ్ ఘనీ వెళ్లేప్పుడు వెంట పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్లారు. మరోవైపు, ఆ హెలికాప్టర్ నేరుగా ఒమన్ వెళ్లిందని, అక్కడి నుంచి ఘనీ అమెరికాకు వెళ్లి తలదాచుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఘనీ ఏ దేశానికి వెళ్లారన్నదానిపై కచ్చితమైన సమాచారం వెలువడలేదు.
మరోవైపు, తాలిబన్ల పాలనలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌లో ఘోరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఘనీతో పాటు పలువురు మంత్రులు కూడా దేశం విడిచి వెళ్లారు. దీంతో, అఫ్గాన్ తాత్కాలిక ప్రెసిడెంట్‌గా తాలిబన్ల చీఫ్ అబ్దుల్ ఘనీని తాలిబన్లు నియమించుకున్నారు. అబ్దుల్ ఘనీ సారథ్యంలో మొత్తం అధికార మార్పిడి ప్రక్రియ జరుగుతోంది. మరోవైపు, తాలిబన్ల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం కోసం… జనం పరుగులు తీస్తున్నారు. అయితే, ప్రజలు తమ ఉద్యోగాలు, వ్యాపారాలు యథావిధిగా చేసుకోవచ్చని, వారిని తాము క్షమించామని తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు.