టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సీఐడీ వాదనలు పూర్తయిన తర్వాత లూథ్రా తన వాదనలు మొదలుబెట్టారు. ఆ వెంటనే సీఐడీ అధికారులపై లూథ్రా ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. ఓ వైపు లాజికల్ గా, మరోవైపు టెక్నికల్ గా..ఇంకోవైపు లా పాయింట్లతో లూథ్రా వేసిన ప్రశ్నలకు సీఐడీ అధికారులు అవాక్కయ్యారని తెలుస్తోంది. 2021లో హైకోర్టులో ఈ స్కాం కేసు వాదనలు పూర్తయి తీర్పు రిజర్వ్ అయ్యిందని వివరించారట. కేవలం రాజకీయ కక్షతోనే ఎన్నికల ముందు చంద్రబాబును ఈ కేసులో ఇరికించారని వాదించారట.
ఈ కేసులో సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదని, ఏ-35 సత్యభాస్కర్ ప్రసాద్‌ను కు కూడా అరెస్ట్ సమయంలో ఆ సెక్షన్ వర్తించదని వాదనలు వినిపించారట. పాత ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేదని, మరి, ఆయనను సీఐడీ ఎందుకు అరెస్ట్ చేసిందని అడిగారట. పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ఉదాహరణగా చూపి చంద్రబాబు రిమాండ్ రిపోర్టు తిరస్కరించాలని న్యాయమూర్తిని లూథ్రా కోరినట్లు తెలుస్తోంది. నంద్యాల మెజిస్ట్రేట్ కోర్టు వదిలేసి విజయవాడ కోర్టులో చంద్రబాబును ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ప్రవేశపెట్టిందని ఆరోపించారట. రాత్రి 11 గంటలకు చంద్రబాబును చుట్టుముట్టారని, అప్పటి నుంచే అరెస్ట్ చేసినట్టు పరిగణించాలని కోరారని తెలుస్తోంది.
అవినీతి నిరోధక చట్టాన్ని సీఐడీ అధికారులు పాటించలేదని, గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేసి విచారణ జరిపారని ఆరోపించారట. రిమాండ్ రిపోర్టు వరకు మాత్రమే వాదనలు పరిమితం చేయాలని, ఇది అనుబంధ పిటిషన్ అని, అరెస్టుకు అర్థం ఇది అని సీఐడీ లాయర్లకు లూథ్రా వాదించారట. మరోవైపు, కోర్టు బయట భారీగా పోలీసులు, వాహనాలు సిద్ధం చేశారు పోలీసులు. దీంతో, ఒకవేళ చంద్రబాబుకు బెయిల్ నిరాకరిస్తే ఆయనను రాజమండ్రి జైలుకు తరలించే అవకాశముందని తెలుస్తోంది. అందుకే, రాజమండ్రి వెళ్లే రూటు కూడా క్లియర్ చేసేలా పోలీసులు రెడీ అవుతున్నారని పుకార్లు వస్తున్నాయి.