గడిచిన నాలుగున్నరేళ్లకు పైనే ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి తాను పాల్గొనే ఏ ప్రోగ్రాం కోసం హెలికాఫ్టర్ ను విధిగా వినియోగించే ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని లక్షలాది చెట్లు ఇప్పటివరకు బలైపోయిన పరిస్థితి. సెక్యూరిటీ అతి చేష్టల వల్ల, హెలికాఫ్టర్ ల్యాండ్ కోసం కొన్నిసార్లు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. జగన్ వల్ల చెట్టు చేమా బావురుమంటున్నాయి.
తాజాగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పట్టణ.. గ్రామీణ ప్రాంతాలతో సహా ఏపీ వ్యాప్తంగా క్రీడల్ని ప్రోత్సహించేందుకు వీలుగా చేపట్టామని చెప్పినా ఇది ఎన్నికల ప్రమోషన్ కార్యక్రమం అని అందరికీ అర్థమైంది. అరాచకం ఏంటంటే… దీనికోసం కూడా .. చెట్లను నరికేయటం. ఆడుదాం ఆంధ్రా పేరుతో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతున్నారంటే చాలు.. ఆయన హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే ప్రదేశానికి చుట్టుపక్కలున్న చెట్లను నరికేస్తున్నారు.
తాజాగా గుంటూరు నల్లపాడులో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొనటానికి సీఎం జగన్ వస్తున్నారు. అదే విధంగా ఈ నెల 29న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సీఎం జగన్ వెళుతున్నారు. ఈ రెండు చోట్ల సోమవారం పెద్ద ఎత్తున చెట్లను నరికేశారు. దీనికి కారణం.. ఆయన ప్రయాణించే హెలికాఫ్టర్ కు అడ్డు వస్తాయన్న ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగా.. పెద్ద ఎత్తున చెట్లను.. చెట్ల కొమ్మల్ని పెద్ద ఎత్తున నరికేసిన వైనాన్ని పలువురు తప్పు పడుతున్నారు. చెట్లకు ఇబ్బంది కలగకుండా సీఎం జగన్ ప్రయాణించే హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్ లను ఎంపిక చేస్తే సరిపోతుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు.
సీఎం జగన్ ప్రయాణించే హెలికాఫ్టర్ ల్యాండింగ్ కోసమే కాదు.. ఆయన కాన్వాయ్ ప్రయాణించే దారంతా కూడా చెట్లను.. చెట్ల కొమ్మల్ని భారీగా నరికేయటమో లేదంటే తొలగించే చర్యల్ని ఆపితే మరింత బాగుంటుందంటున్నారు. ఈ వ్రక్ష విలాపం ఇంకెంత కాలమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అధికారుల తీరుపై సీఎం జగన్ స్పందించి.. చెట్లను తొలగించే కార్యక్రమాన్ని నిలువరించాలన్న వినతి వినిపిస్తోంది. మరి.. అలా జరుగుతుందంటారా?