తెలంగాణలోని నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించిన వైనం దేశ రాజకీయాల్లో సంచలనం రేపింది. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఈ ఆపరేషన్ కు బీజేపీకి సంబంధం ఉందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదంతా టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న డ్రామా అని బిజెపి నేత బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలించేందుకు హైకోర్టు అనుమతించింది.
ఆ ముగ్గురిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. నిందితులను అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని హైకోర్టు ఆదేశించింది. ఇక, ఈ కేసుపై విచారణ జరపకుండా ఆదేశాలు జారీ చేయాలని బిజెపి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు స్టే విధించింది. అయితే, నిందితుల రిమాండ్ పై మాత్రం స్టే ఉండదని కోర్టు వెల్లడించింది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఇక, ఈ కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు పార్టీ మారితే డబ్బులు, పదవులు ఇస్తామంటూ ఆ ముగ్గురు బేరసారాలాడినట్టుగా ఆరోపణలున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా రోహిత్ రెడ్డికి భద్రతను పెంచిన తెలంగాణ సర్కార్ ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మంజూరు చేసింది. అంతేకాదు, రోహిత్ రెడ్డి ఇంటి వద్ద పోలీస్ పికెట్, 4 + 4 భద్రతను ఏర్పాటు చేసింది.