ప్రస్తుతం హుజురాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గతంలో తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే, కేసీఆర్ పై ఈటల తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో ఆ శాఖను కేసీఆర్ తనవద్దే ఉంచుకున్నారు. తాజాగా ఉప ఎన్నిక ముగియడంతో ఆ శాఖపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రకారం ఆ ఫైల్ పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకం చేశారు.
కేసీఆర్ కరోనాబారినపడిన సమయంలో హరీశ్ రావే వైద్య, ఆరోగ్యశాఖను చూసుకున్నారు. అంతేకాదు, కరోనా కట్టడిపై, వ్యాక్సినేషన్ ప్రక్రియపై వైద్య శాఖ ఉన్నతాధికారులతో పలు సమీక్షలను కూడా హరీశ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా వైద్యారోగ్యశాఖను హరీశ్ రావుకు కేసీఆర్ అప్పగించారు. అంతేకాదు, తెలంగాణలో కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణంతో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కేసీఆర్ భావిస్తున్న తరుణంలో హరీశ్ కు ఈ బాధ్యతలు అప్పగించడం విశేషం.
సీనియర్ మంత్రి అయిన హరీశ్…ఈ కీలకమైన రెండు శాఖలను సమర్థవంతంగా నిర్వహించగలరన్న నమ్మకంతోనే కేసీఆర్ వాటిని అప్పగించారని తెలుస్తోంది. దీంతో, ఇప్పటి వరకు ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగుతున్న హరీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖను కూడా పర్యవేక్షించేందుకు రెడీ అవుతున్నారు. అయితే, కేసీఆర్ దగ్గర హరీశ్ కు ప్రాధాన్యత తగ్గుతుందన్న పుకార్లు వస్తున్న తరుణంలో వాటికి చెక్ పెట్టేందుకు కూడా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.